ఇదీ జాతీయ రహదారి పరిస్థితి...
పేరుకు మాత్రమే అభివృద్ధి
ప్రయాణికుల ఇబ్బందులు వర్ణనాతీతం
ప్రజల ఆవేదన పట్టని ప్రజాప్రతినిధులు
అలసత్వంలో అధికారులు
ప్రజాశక్తి- కుప్పం
మండలంలోని గ్రామ పంచాయతీల్లో ఒకటైన మల్లానూరు గ్రామాన్ని ప్రత్యేక మండలంగా ప్రకటించాలన్న వాదన గ్రామస్తులలో బలంగా ఉంది. ఇంతటి ప్రాముఖ్యత గల గ్రామంలో రహదారులు అస్తవ్యస్తంగా ఉండడంపై గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా ఆంధ్ర- తమిళనాడు రాష్ట్రాలను కలుపుతూ అంత రాష్ట్రాల జాతీయ రహదారిగా ఉన్న ఈమార్గంలో ప్రతినిత్యం వందలాది వాహనాలు వస్తూ పోతూనే ఉంటాయి. అంతేకాక ఈ మార్గం గుండా అనేక గ్రామాలకు రాకపోకలు నిర్వహించడానికి రహదారులు ఉండడంతో ప్రతినిత్యం వేలసంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రతినిత్యం రద్దీగా ఉన్న గ్రామ కేంద్రంలో సైతం రోడ్లు గజానికి ఒక గుంత అన్న రీతిలో రహదారి మొత్తం గుంతలమయంగా మారింది. ఈ గుంతలలో మురుగునీరు చేరి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో రహదారిపై గల గుంతలు వర్షపునీటితో నిండిపోయి ప్రమాదాలు జరిగిన సందర్భాలు లేకపోలేదని స్థానికులు చెబుతునానరు. ఈ రహదారి గుండా ప్రయాణాలు సాగిస్తున్న భారీ, మధ్యతరహా వాహన యజమానులు రోడ్ల గుంతలమయంగా మారడంతో తమ వాహనాలు త్వరగా మరమ్మతులకు గురైతున్నాయని, వాటిని మరమ్మతులకు వేలల్లో వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ ఆవేదన చెందుతున్నారు. గుంతల్లో వాహనలు నడుపుతూ వాటి రిపేర్లకే వచ్చే సంపాదనంతా పోతుంటే ఇక కుటంబాలను ఎలా పోషించుకోవాలని పలువురు డ్రైవర్లు వాపోతున్నారు.
ఈసమస్యలపై స్పందించిన పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ కొద్ది నెలలకు ముందు గ్రామాభివద్ధి అంటూ స్థానిక ప్రజాప్రతినిధులు హడావిడి చేశారని, కానీ అభివద్ధి జరిగింది మాత్రం అంతంత మాత్రమేనని ఆరోపిస్తున్నారు. ప్రజలకు అత్యంత అవసరమైన రవాణా మార్గాలే గ్రామపరిధిలో సక్రమంగా లేవని, దీంతో వాహనదారులతో పాటు గ్రామస్తులకు ఇబ్బందులు తప్పడం లేదని తెలిపారు. గత నాలుగు సంవత్సరాలుగా ప్రజాప్రతినిధులు కుప్పం నియోజకవర్గం అభివద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప స్థానికంగా జరిగిన అభివద్ధి శూన్యమని అంటున్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులు కానీ, సంబంధిత ప్రభుత్వ అధికారులు కానీ ఏ మాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ధ్వజమెత్తారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామపరిధిలో రహదారులను మరమ్మతులు చేసి మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరుతున్నారు.










