May 09,2022 22:15

ధర్నా చేస్తున్న పవర్‌ లూమ్‌ కార్మికులు

మంత్రి రోజా పట్టించుకోవాలి
మాజీ ఎంపి పి.మధు డిమాండ్‌
'నగరి- తిరుపతి' పాదయాత్ర చేపడతాం
ప్రజాశక్తి - నగరి:
పెంచిన ఈడీ (ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఛార్జెస్‌) ఛార్జీలను తగ్గించాలని, మంత్రి రోజా జోక్యం చేసుకోవాలని సిపిఎం రాష్ట్ర నాయకులు, మాజీ ఎంపి పి.మధు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం పట్టించుకోని పక్షంలో నగరి నుంచి తిరుపతి వరకూ పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు. పెంచిన విద్యుత్‌ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సిఐటియు పిలుపు మేరకు నగరి పట్టణంలోని టవర్‌క్లాక్‌ నుంచి విద్యుత్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి రోజా పవర్‌లూమ్‌ కార్మికులకు మద్దతు పలకాలని నినాదాలతో హోరెత్తించారు. ర్యాలీ అనంతరం ధర్నాను ఉద్దేశించి పి.మధు మాట్లాడుతూ పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో నేతవృత్తి చేసే నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 500 యూనిట్ల మేరకు ఉచిత విద్యుత్‌ ఇచ్చి ఆదుకోవడంతో పాటు నేతన్నలు నేసే వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేసి అండగా ఉందన్నారు. అయితే జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం పవర్‌లూమ్‌ కార్మికుల సమస్యలను అసలు పట్టించుకోవడం లేదన్నారు. మంత్రి రోజా మాట్లాడిన ప్రతిసారీ తన భర్త నేత కార్మికుల సామాజికవర్గానికి చెందినవాడని, నేత కార్మికుల సమస్యలు తనకు బాగా తెలుసని, డప్పాలు కొట్టుకోవడమే తప్ప అసెంబ్లీలో ఏనాడూ నేత కార్మికుల గురించి ప్రస్తావించలేదన్నారు. ఇప్పటికైనా మరమగ్గం కార్మికులకు మద్దతు పలుకుతున్నట్లు ప్రకటించాలని, లేనిపక్షంలో సిఐటియు తరపున నగరి నుంచి తిరుపతి వరకూ పాదయాత్ర చేస్తానని, అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేసైనా రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి పెంచిన విద్యుత్‌ ఛార్జీలను తగ్గిస్తానని తెలిపారు. మంత్రి అండదండలతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు చెందిన కుశస్థలి నదిలో ఇసుకను దోచేస్తున్నారని, విజయపురం మండలంలో గ్రావెల్‌ను తమిళనాడు రాష్ట్రానికి తరలించి కమీషన్లు పొందుతున్నారని విమర్శించారు. పవర్‌లూమ్‌ కార్మికులకు అండగా నిలవాల్సిన టిడిపి, జనసేన పార్టీలూ పోరాటాలకు ముందుకు రావడం లేదన్నారు. ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు సిగ్గుపడాలన్నారు. పవర్‌లూమ్‌ కార్మికుల సమస్యను అర్ధం చేసుకుని, తక్షణమే పెంచిన విద్యుత్‌ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు.
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఛార్జెస్‌ పేరిట ఆరు పైసల నుంచి రూపాయికి పెంచడం వల్ల పవర్‌లూమ్‌ కార్మికులకు ప్రతినెలా 1500 వచ్చే బిల్లు 4,500 వస్తోందన్నారు. పవర్‌లూమ్‌ కార్మికులకు 'అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన' వంటి సంక్షేమ పథకాలు వర్తించకుండా కోతలు పెడుతున్నారని మండిపడ్డారు. ట్రూఅప్‌ ఛార్జీల పేరిట విద్యుత్‌ ఛార్జీలను పెంచారని, సిఐటియు చేసిన పోరాటంతో వెనక్కి తగ్గారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, చిత్తూరు జిల్లా కార్యదర్శి వాడా గంగరాజు, సిఐటియు చిత్తూరు జిల్లా కార్యదర్శి చైతన్య, నియోజకవర్గ ఇన్‌ఛార్జి వెంకటేష్‌, మరమగ్గం కార్మికుల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు పెరుమాళ్‌, షణ్ముగం, జగదీష్‌, తంగరాజు, రాజా, రంజిత్‌ గణపతి, అయ్యప్ప పాల్గొన్నారు.