Jun 28,2022 22:12

ఇద్దరు దొంగలు అరెస్టు - 20 ద్విచక్రవాహనాలు స్వాధీనం
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
చిత్తూరు పరిసరప్రాంతాల్లో ద్విచక్రవాహనాల దొంగతనాలు పాల్పడుతున్న నేరస్తులు శివశంకర్‌, వసంత్‌లను తమిళనాడు రాష్ట్రం, వేలూరు జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. వన్‌టౌన్‌ సిఐ నరసింహరాజు నేతృత్వంలో మంగళవారం వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. వీరి వద్ద నుండీ చిత్తూరు, తమిళనాడుకు చెందిన 20 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఆరు బుల్లెట్‌ వాహనాలున్నాయి. సుమారు రూ.25లక్షలు ఉంటుందని డిఎస్‌పి సుధాకర్‌రెడ్డి తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు చిత్తూరు రెడ్డిగుంట జంక్షన్‌లో వాహనాలు తనిఖీ చేస్తుండగా వేలూరు వైపుగా రెండు మోటారు సైకిల్‌ల మీద వస్తున్న నలుగురు వ్యక్తులు పోలీసుల తనిఖీ చూసి పారిపోయేందుకు ప్రయత్నించడంతో సిబ్బంది ద్విచక్రవాహనాలతో సహా వారిని పట్టుకోవడం జరిగింది. అనంతరం వారిని విచారించగా వారిద్దరు, ఇంకా కొందరు కలిసి చిత్తూరు పట్టణం, పరిసర ప్రాంతాలలో జన సంచారం తక్కువగా ఉన్న చోట పార్క్‌ చేసిన మోటార్‌ సైకిల్‌లను దొంగలిచుకొని పోయి తమిళనాడులో తక్కువ రేటుకు అమ్ముకొని వచ్చిన డబ్బులతో విలాసవంతమైన జీవితం గడిపేవారని ఒప్పుకున్నారు. చిత్తూరు- తమిళనాడు సరిహద్దు అటవీ ప్రాంతంలో కొన్ని ద్విచక్రవాహనాలు దాచిపెట్టి ఉన్నానని చెప్పారు. అక్కడికి వెళ్లి చూడగా చిత్తూరు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన వివిధ దొంగతనాలకు సంబంధించిన ద్విచక్రవాహనాలు ఉన్నట్లు గుర్తించారు. అందులో 6 బుల్లెటు వాహనాలు, దాని మతింపు సుమారు రూ.12లక్షల, వివిధ కంపెనీల ద్విచక్ర వాహనాలు 14 ఉన్నాయని వాటి విలువ సుమారు రూ.14లక్షలు మొత్తంగా 20 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకోగా వాటి విలువ సుమారుగా రూ.26లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అలాగే పూతలపట్టు పోలీస్‌స్టేషన్‌కు సంబంధించిన చోరీ కేసులో రూ.3వేలు స్వాధీనం చేసుకొని ముద్దాయిలు ఇద్దరినీ రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డిఎస్‌పి తెలిపారు.