ఇచ్చినప్పుడే పుచ్చుకో...!
సర్వేరాళ్ల కొనుగోళ్లపై ప్రభుత్వ షరతులు
'బిల్లుల'పై గ్రానైట్ యజమానుల్లో ఆందోళన
ప్రజాశక్తి - చిత్తూరుఅర్బన్
బ్రిటీష్ కాలం తరువాత మొట్టమొదటి సారిగా వైఎస్‌ఆర్ సర్కార్ 'వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూ రక్ష పథకం' పేరుతో భూ రీసర్వే ప్రతిష్టాత్మకంగా తీసుకొని శరవేగగంగా రెవిన్యూ సిబ్బంది ద్వారా చేపడుతోంది. సర్వే పూర్తి చేసిన తరువాత హద్దులను నిర్ణయిస్తూ రాళ్లను పాతేందుకు గ్రానైట్ ఫ్యాక్టరీల నుండీ సర్వే రాళ్లను అందించాలని కోరింది. స్వయంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్వారీ, గ్రానైట్ యజమానులతో చర్చించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమానికి సర్వే రాళ్ళు సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. మైనింగ్, రెవిన్యూశాఖ అధికారులు నెల రోజుల క్రితం జిల్లా కేంద్రంలో గ్రానైట్ యజమానులతో సమావేశం నిర్వహిచి సర్వే రాళ్ల సరఫరాపై చర్చించారు. ప్రభుత్వం చేపడుతున్న రీసర్వేకు అవసరమైన సర్వే రాళ్ళు సరసమైన ధరకుల రెండు అడుగుల ఎత్తు, ఆరు ఇంచీల వెడల్పుతో అందించాలని, ఒక్క రాయికి రూ. 270 చెల్లించేలా ఒప్పదం కుదర్చుకున్నారు. బిల్లుల విషయానికి వస్తే ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తే అప్పుడు తీసుకోవాలనే షరతు పెట్టారు. అయితే ఈ షరతే గ్రానైట్ యజమానులను కలవర పెడుతోంది.
ఇప్పటికే ప్రభుత్వం నిర్మిస్తున్న వివిధ రకాల ప్రభుత్వ భవనాలు, రోడ్డులు, ఇతర అభివృద్ధి పనుల బిల్లులు రాక గుత్తేదార్లు ( కాంట్రాక్టర్లు ) ప్రభుత్వ పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో సర్వే రాళ్ళు సరఫరా చేస్తే బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితుల్లో గ్రానైట్ యజమానులు వెనకడుగు వేస్తున్నట్లు కొందరు గ్రానైట్ యజమానులు చెబుతున్నారు. మరో వైపు జిల్లాలోని గ్రానైట్ పరిశ్రమలు ప్రభుత్వం అంగీకారం మేరకు సింగిల్ బ్రేడుఉన్న పరిశ్రమలు 450, మల్టీబ్రేడ్ పరిశ్రమలు 900 రాళ్లను సరఫరా చేయాల్సి ఉంటుంది. వీటికి పాలిష్ చేసి ఓ వైపు భూ సురక్ష పధకం 2020 అని రాయాల్సి ఉంటుంది. ఇలా రాళ్ళు తయారు చేయాలంటే లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని గ్రానైట్ యజమానులు చెబుతున్నారు. స్వంత డబ్బులు లక్షల రూపాయలు ఖర్చు చేసి తయారు చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఎంత లేదన్నా ప్రభుత్వ నిబంధనల మేరకు రాళ్ళు తయారు చేసి ఇవ్వాలంటే ఒక్కొ ఫ్యాక్టరీ యజమాని తన జేబు నుండీ రూ. 10 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుందంటున్నారు. ఇప్పటికే జీఎస్‌టి నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న గ్రానైట్ పరిశ్రమ జిల్లాలో అనేక చిన్నచిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. తాజాగా ప్రభుత్వ ఆదేశాలతో సర్వే రాళ్ళు సరఫరా చేసి బిల్లులందక మరికొన్ని పరిశ్రమలు ఇదే దారిపట్టాల్సి వస్తుందని కొందరు గ్రానైట్ పరిశ్రమల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దగ్గర పడుతున్న గడవు
నవంబర్ 30వ తేదీలోపుగా సర్వే రాళ్ళు అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వం బిల్లుల చెల్లింపు విషయంలో ఎలాంటి నిర్ణయం ప్రకటించక పోవడంతో అనేక మంది గ్రానైట్ యజమనులు సర్వే రాళ్ల తయారీకి ఉపక్రమించన్నట్లు సమాచారం. క్వారీల నుండీ బండరాళ్ళు తీసుకోవాలంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులు ఎటూ తెచ్చుకోలేక అష్టకష్టాలు పడుతున్నారు. అధికారులు మాత్రం ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉన్నందున ఎలాగైనా సరఫరా చేయాల్సిదేనంటూ గట్టిగా చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎం చేయాలో దిక్కుతోచక గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులు కొట్టుమిట్టాడుతున్నారు.










