
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్: రేషన్ కార్డుల కోసం ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న వలస, అసంఘటిత కార్మికులకు కార్డులు మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ తన ఛాంబర్‌లో మంగళవారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా 6,12,408 మంది కార్మికులు నమోదు లక్ష్యంగా నిర్ణయించామని అన్నారు. ఇప్పటి వరకూ 4,91,852 మంది కార్మికులు నమోదు పూర్తయిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు 80.31 శాతం లక్ష్యాన్ని చేరుకున్నామని అన్నారు. మిగిలిన వారి నమోదుకు విస్తృత ప్రచారం కల్పించి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని చెప్పారు. అలాగే ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదైన డేటా లేబర్ కార్యాలయం నుంచి వచ్చిన వెంటనే రైస్ కార్డ్స్ లేని వారికి కార్డులు మంజూరు చేసేందుకు సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చామన్నారు. ఎసిఎల్ త్వరగా డేటా తెప్పించాలని సూచించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం ఈ-శ్రమ్ కార్డు ద్వారా ప్రయోజనం పొందవచ్చని వివరించారు. కార్యక్రమంలో డిఎస్‌ఒ రమణ, జిల్లా పరిషత్ సిఇఒ ఆర్.వెంకట్రామన్, గ్రామ సచివాలయాల నోడల్ అధికారి వాసుదేవరావు, డ్వామా పీడీ చిట్టిరాజు, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ జి.ఎల్లాజీరావు పాల్గొన్నారు.