ఈ కుర్చీ మాకొద్దు..
ఎంఇఓ ఛాంబర్ గదికి తాళం
విద్యాశాఖ కార్యాలయం ఖాళీ..
ప్రజాశక్తి- వెదురుకుప్పం:
వెదురుకుప్పం మండలం విద్యాశాఖ ఎంఇఓ ఛాంబర్ గది గత కొన్ని రోజులుగా తాళం వేసే ఉంది.. గతంలో ఇన్‌ఛార్జి ఎంఇఓగా విజయకుమార్ మూడు సంవత్సరాలకు పైగా బాధ్యతులు నిర్వహించారు. అయితే ఈ ఏడాది ఆగస్టు నెలలలో రెగ్యులర్ ఎంఇఓగా వసుమతీ దేవికి ఉత్తర్వులు అందాయి. బాధ్యతలు స్వీకరించిన వసుమతీదేవి నెల రోజులకే దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో మళ్లీ ఇన్‌ఛార్జి ఎంఇఓగా విజయకుమార్‌ను బాధ్యతలు స్వీకరించాల్సిందిగా ఉత్తర్వులు అందాయి. కానీ ఆయన నెలరోజులుగా బాధ్యతలు చేపట్టకపోవడంతో ఎంఇఓ ఛాంబర్ గది తాళంతోనే ఉండిపోయింది. ఇదిలా ఉండగా విద్యాశాఖ కార్యాలయంలో సమాచారం ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరిచే ఇద్దరు సిబ్బందిలో ఒకరు విధుల నుంచి తొలగిపోగా, మరొకరు తిరుపతి జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి డిప్యుటేషన్‌పై వెళ్లారు. దీంతో మండల విద్యాశాఖ కార్యాలయం ఖాళీగా దర్శనమిస్తోంది. ఎంఈఓ లేక ఈనెల జీతం అందుతాయా లేదా అని పట్టించుకోకపోవడంతో జిల్లా విద్యాశాఖపై విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి నెలకొంది.
జీతాల కోసమే జాయిన్ అయ్యాను..
- విజయకుమార్, ఇన్‌ఛార్జి ఎంఇఓ
ఉపాధ్యాయులు ఎవరూ జీతం లేకుండా ఇబ్బంది పడకూడనే ఉద్యేశంతోనే బాధ్యతలు స్వీకరించాను. నా అనారోగ్య సమస్యల కారణంగా నెల రోజులు మాత్రమే విధుల్లో ఉంటాను. ఈ విషయాన్ని డీఈవో దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.










