
* రెండు రోజుల గడువుతో రైతుల్లో గుబులు
* 50 శాతం మాత్రమే నమోదు
* గడువు పెంపుపై ఆశలు
రైతుల గుండెల్లో ఇ-క్రాప్ గుబులు పుట్టిస్తోంది. నమోదుకు మూడు రోజులు మాత్రమే గుడువు ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు పండిస్తున్న పంటలకు ఇ క్రాప్ తప్పనిసరని, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని పదేపదే జిల్లా కలెక్టర్‌తోపాటు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో అడుగు ముందుకు పడడం లేదు. మండలంలో ఇప్పటి వరకు కేవలం సుమారు 40 శాతం మాత్రమే ఇ క్రాప్ నమోదైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రజాశక్తి- పలాస : మండలంలో సుమారు 12,226 ఎకరాల్లో వరి, జీడి, కొబ్బరి, మామిడి, పనస, మునగ తదితర పంటలను సాగుచేస్తున్నారు. అందులో వరికి సంబంధించి 9437 ఎకరాల్లో ఎదలు, ఉబాలు వేశారు. రైతులు పండిస్తున్న పంటలకు ఇ క్రాప్ చేయాలని సుమారుగా గత నెల రోజులుగా వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ బాలాజీ లాఠకర్, వ్యవసాయ, ఉద్యానవన శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నా క్షేత్ర స్థాయిలో అనుకున్నంతగా ఇ క్రాప్ నమోదు కాలేదు. అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. మండలంలో ఇప్పటి వరకు సుమారు 6656 ఎకరాల్లో ఇ క్రాప్ జరగగా అందులో వరికి సంబంధించి 4953 ఎకరాల్లో పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
వేధిస్తున్న సిబ్బంది కొరత
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీతోపాటు పలాస మండల పరిధిలో 21 రైతు భరోసా కేంద్రాలున్నాయి. అందులో 21 మంది వ్యవసాయ శాఖ అసిస్టెంట్లను నియమించాల్సి ఉండగా కేవలం 12 మంది మాత్రమే పని చేస్తున్నారు. అందులో తర్లకోట అగ్రికల్చరల్ అసిస్టెంట్ పదోన్నతిపై వెళ్ళి పోగా పదకొండు మాత్రమే మిగిలారు. దీంతో పూర్తి స్థాయిలో పనులు జరగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఒక్కో అగ్రికల్చరల్ అసిస్టెంట్ రెండు సచివాలయాల పరిధిలో ఉన్న పంటలను ఇ క్రాప్ చేయాల్సి వస్తుందని, పని భారం పెరగడంతో పనులు చేసేందుకు మొగ్గు చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఇ క్రాప్ ఎంత వరకు వచ్చింది? ఎంత శాతం చేశారు? తదితర అంశాలపై ఆరా తీస్తున్న సమయంలో ఇ క్రాప్ చేస్తున్నామని చెబుతున్నారే తప్ప క్షేత్రస్థాయిలో చేయడంలేదనే విమర్శలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి.
50 శాతం మాత్రమే...
మండలంలో ఇప్పటి వరకు సుమారు 50 శాతం మాత్రమే ఇ క్రాప్ నమోదైంది. ఈ నెల 15 తేదీలోగా నమోదు పూర్తి చేయాలని జిల్లా ఉన్నతాధికారులు మండల స్థాయి అధికారులకు అల్టిమేట్ జారీ చేశారు. నెల రోజుల నుంచి ప్రారంభించినా ఇప్పటి వరకు 50 శాతం పూర్తి చేయగా కేవలం మూడు రోజుల్లో మరో 50 శాతం పూర్తి చేయడం కష్టతరం. మండలంలోని మాకన్నపల్లి, బొడ్డపాడు, గురుదాస్ పురం, నీలావతి, చినంచల తదితర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో నమోదు కాలేదు. ఈ విషయం తెలుసుకున్న రైతులు తమ పంటలకు ఇ క్రాప్ చేయలేదని, ప్రకతి వైపరీత్యాల సమయంలో నష్ట పరిహారం అందక పోవచ్చునని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం పై పలాస వ్యవసాయ శాఖ ఎడిఎ ఎల్ వి మధు ను వివరణ కోరగా ఇ క్రాప్ నమోదు శాతం తగ్గడం వాస్తవమేనని, సిబ్బంది కొరత వల్ల ఈ సమస్య తలెత్తుతోందన్నారు.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దష్టికి తీసుకు వెళ్లామని, అయితే ఇ క్రాప్ నమోదుపై సమయం పెంచే అవకాశం ఉందని చెప్పారు.