Oct 17,2022 22:44

ఈ క్రాప్‌ నమోదుతోనే పంటనష్టం : కలెక్టర్‌
ప్రజాశక్తి- రొంపిచెర్ల
: రైతులు సాగుచేసిన వ్యవసాయ పంటలను ఈ క్రాప్‌ నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే పంట నష్టపరిహారం మంజూరు అవుతుందని చిత్తూరు జిల్లాకలెక్టర్‌ ఎం.హరినారాయణ్‌ తెలిపారు. ఆయన సోమవారం రొంపిచెర్ల మండలంలోని గానుగచింత, మోటుమల్లెల, బొమ్మయ్యగారిపల్లి గ్రామ పంచాయతీలలో పర్యటించి రైతులు సాగుచేసిన పంటలను పరిశీలించారు. ఈ క్రాప్‌ చేశారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. బొమ్మయ్యగారిపల్లి గ్రామపంచాయతీలోని మేల్లయ్యగారిపల్లె సమీపంలో వ్యవసాయ పొలంలో ఉన్న సులోచన అనే మహిళా రైతును విచారించారు. మహిళా రైతు మాట్లాడుతూ వేరుశెనగ పంట సాగు చేశామని, అడవి పందులు పంటలను పూర్తిగా నాశనం చేశాయని తెలిపారు. కనీసం రెండుబస్తాల కాయలు కూడా రాలేదని వాపోయారు. అలాగే గానుగచింత గ్రామపంచాయతీలోని జగడంవారిపల్లిలో మహిళా రైతు సునీతను ఎంత పంటసాగు చేశారని అడగగా 1.5ఎకరాల వేరుశనగ పంట సాగుచేశామని, 12 బస్తాల కాయలు దిగుబడి వచ్చిందని తెలిపారు. అయితే వర్షాలు పడడం వల్ల పంట మొలకలు వచ్చాయని దీని వలన రైతులకు గిట్టుబాటు కాలేదని తెలిపారు. వేరుశనగ గడ్డి ఏమి చేశారని అడగగా పాడి ఆవులు ఉన్నాయని వాటికి మేత వేస్తున్నామని తెలిపారు. లీటర్‌ పాలకు ఎంత ధర ఇస్తున్నారని అడగగా లీటరుకు రూ.30ల ధర నుంచి 31లవరకు ఇస్తున్నారని తెలిపారు. అలాగే మోటుమల్లెల గ్రామపంచాయతీలోని ఇద్దరు రైతులు సాగు చేసిన పంటను చూసి సంతప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ మురాషావలి, ఎంపీడీఓ రాజేంద్ర, అగ్రికల్చర్‌ ఏఈ సుధారాణి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు వెంకట రమణారెడ్డి, అబ్దుల్‌ఖాదర్‌, గ్రామవ్యవసాయ సహాయకులు సుబ్రమణ్యం, నర్మదా, సుజాత, శ్రావణి, నరసింహులు, వీఆర్వో మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.