Oct 09,2023 22:01

మాట్లాడుతున్న రైతుసంఘం జిల్లా కార్యదర్శి మోహనరావు

ప్రజాశక్తి - వజ్రపుకొత్తూరు: ఈ-క్రాప్‌ నమోదు గడువు పెంచాలని ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు డిమాండ్‌ చేశారు. మండలంలోని సీతాపురంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సుమారు 4.5 లక్షల ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు 80 శాతం పంటకు ఈ-క్రాప్‌ బుకింగ్‌ జరిగిందన్నారు. ఈ-క్రాప్‌ నమోదు కాని రైతులు పలు విధాలుగా నష్టపోతారని తెలిపారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో పంటల బీమా వర్తించకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట పండితే రైతు భరోసా కేంద్రాల్లో అమ్ముకోవడానికి అవకాశం లేకుండా పోతోందని చెప్పారు. రైతుభరోసా పథకానికి అనర్హులవుతారని తెలిపారు. వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ-క్రాప్‌ నమోదు గడువును ఈనెలాఖరు వరకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆయనతో పాటు రైతుసంఘం మండల నాయకులు బాలాజీ, భాస్కరరావు ఉన్నారు.