Sep 16,2023 23:17

ఈ గాలి ఎటువైపు...?

   తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి. జిల్లా రాజకీయాల్లో సరికొత్త ఆలోచనలకు, సమీకరణలకు శ్రీకారం చుట్టే పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు అరెస్టుతో ప్రజల్లో ఉప్పెనలా నిరసనలు ఉంటాయని ఆ పార్టీ సీనియర్లు ఆశించారు. టెక్కలి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కింజరాపు అచ్చెన్నాయుడు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న జిల్లాలో ప్రజల్లోనే కాదు, పార్టీ కార్యకర్తల్లోనూ కనిపించలేదు. రోడ్డెక్కడానికి పోలీసులు అవకాశం ఇవ్వడం లేదని, గృహ నిర్బంధాల్లో ఉన్నామని పలువురు నేతలు చెప్పుకునే పరిస్థితిని చూశాం. పార్టీ వర్గాల ప్రకారం జిల్లాలో సుమారు 50 వేల సభ్యత్వం టిడిపికి ఉంది. గడిచిన నాలుగు రోజులుగా ఐదారు వేలకు మించి కార్యకర్తలు కదలి రాలేదని తెలుస్తోంది. చంద్రబాబు అరెస్టు తర్వాత జిల్లావ్యాప్తంగా పోలీసులు వంద మందిని గృహ నిర్బంధం చేశారు. చంద్రబాబు అరెస్టు తర్వాత కార్యకర్తలకు ఇంతకంటే ప్రాధాన్యత ఏముందని రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో చెప్పారు. ఆయన అన్న మాటల్లోనే నిరసనల్లో స్పందన కనిపించలేదన్నది స్పష్టమైంది. కార్యకర్తల సమీకరణ కనిపించలేదని, ఇదే విషయాన్ని బయటవారు తనను అడుగుతుంటే చాలా బాధపడ్డానని చెప్పారు. ఇంత ఆందోళన వ్యక్తం చేసిన అచ్చెన్నాయుడు, ఆయన నియోజకవర్గంలోని టెక్కలిలో బంద్‌ రోజు రోడ్లపై 20 మందికి మించి రాలేదని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. దీక్షా శిబిరంలోనూ వంద మందికి మించి కనిపించలేదు. టెక్కలిలో బంద్‌ నిర్వహణ, రిలే దీక్షలు పేలవంగా జరిగాయని ఆ పార్టీ నాయకులు అంగీకరిస్తున్నారు. టిడిపికి గత ఎన్నికల్లో జిల్లాలో 35 శాతం ఓట్లు లభించాయి. ఈసారి విజయం తమదేనని చెప్పుకుంటున్న తరుణంలో చంద్రబాబు అరెస్టుతో కార్యకర్తలు, నేతలు కొంత డీలా పడినట్లు స్పష్టంగా వెల్లడైంది. మరోవైపు అరెస్టు మరింత సానుకూలమవుతుందని టిడిపి నేతలు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టుతో డీలా పడిన కార్యకర్తలను, నేతల్లో ఉత్సాహం నింపడానికి టిడిపితో జనసేన కలిసి వెళ్తుందని ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చిందని జిల్లాలోని ఆ పార్టీ సీనియర్లు చెప్తున్నారు. ఈ సానుభూతి గాలి జిల్లాలో ఎటువైపు వస్తుందో చూడాల్సి ఉంది. అచ్చెన్నాయుడు నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఓ నేత సమీకరణలో ఇబ్బందుల సమస్యలను చెప్తున్నప్పుడు అవన్నీ ఇప్పుడెందుకు ఎవరైనా వీడియో చేసి వైరల్‌ చేస్తారని చెప్పడం విశేషం. అరెస్టు, జైలు తమకు సానుకూలమన్న మాట ఆ పార్టీ జిల్లా నేతల నుంచి వినిపిస్తోంది తప్ప వారిలో ఈ చర్యలపై ఆవేశం, ఆక్రోశం కనిపించడం పాక్షికంగా ఉంది. బెయిల్‌ నిర్ణయం తేలే వరకు జిల్లాలో టిడిపి కార్యక్రమాల్లో ఎటువంటి పురోగతి ఉండదని నేతలు చెప్పే పరిస్థితి ఉంది.
జనసేనలో చలనం
జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ రాజమహేంద్రవరం రాకుండా హైదరాబాద్‌లో నిరోధించడాన్ని నిరసిస్తూ ఆయన రోడ్డుపై పడుకున్నారు. ఆ చర్యకు గానీ చంద్రబాబు అరెస్టుకు గానీ జిల్లాలో జనసేన అభిమానుల్లో చలనం రాలేదు. ఎక్కడా రోడ్డెక్కలేదు. నిరసనలు చేపట్టలేదు. టిడిపితో కలిసి ఎన్నికలకు వెళ్తామని పవన్‌ ప్రకటించిన తర్వాతనే జిల్లాలో వారిలో కదలిక వచ్చినట్లు కనిపించింది. టిడిపి కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతున్నారు. అయితే, జిల్లాలో ఆ పార్టీకి బలమెంత అన్నది గత ఎన్నికల్లో చూశాం. అంగ బలం, అర్ధ బలం ఉన్న నాయకులు కానరాలేదు. చెప్పాలంటే ఆ పార్టీకి జిల్లాలో నేటికీ నాయకుడినే నియమించలేదు. జనసేన, టిడిపి చెలిమి జిల్లాలో గాలివాటం ఎటువైపు వీస్తుందో చూడాల్సి ఉంది.
దాన్నేమంటారు!
జిల్లాలో వైసిపి రాజకీయాల్లో టెక్కలి ఆశావహుల సంఖ్య ఒకవైపు ఆధిపత్య పోరు గ్రూపుల గోల ఆ పార్టీకి వెన్నంటే ఉంది. గ్రూపుల గోలలోని నియోజకవర్గ కేంద్రాల్లోనూ మండలాల్లోనూ ప్రత్యేక కార్యాలయాలు వెలుస్తున్నాయి. ఆమదాలవలస నియోజకవర్గంలో రెండేళ్ల నాడే సువ్వారి గాంధీ నియోజకవర్గ కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పాతపట్నం నియోజకవర్గంలోని పాతపట్నంలోనూ మరోవైపు కొత్తూరులోనూ ప్రత్యేకంగా పార్టీ కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. గోగుల వరప్రసాద్‌ ఆధ్వర్యాన మామిడి శ్రీకాంత్‌ ఈ కార్యాలయాలను ప్రారంభించినట్లు తెలిసింది. విచిత్రమేమిటంటే నరసన్నపేట నియోజకవర్గం సారవకోటలో జిల్లా అధ్యక్షులే పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం విశేషం. సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత పార్టీ కార్యాలయాలను ప్రారంభించడం సర్వసాధారణం. ఇంత ముందస్తుగా సారవకోటలో ప్రారంభించడం కుటుంబ రాజకీయాలే కారణమని తెలుస్తోంది. ఆయన మేనల్లుడు చిన్నాల కూర్మినాయుడుతో ఉన్న భేదాభిప్రాయాలు కారణంగానే సారవకోటలో ముందస్తుగా వెలిసిందని చెప్తున్నారు. చిన్నాల కూర్మినాయుడు కూడా నరసన్నపేటలో పోటీగా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారన్నది విస్తృతంగా ప్రచారం సాగింది. ఆయన నేటివరకు అందుకు సిద్ధం కాలేదు. నరసన్నపేట, ఆమదాలవలసలో ఎగిరే పిట్టకు మసాలా సిద్దం చేసుకుంటున్న చందంగా ఉందని వ్యంగ్య వ్యాఖ్యానాలు చేసే పరిస్థితి పార్టీలోనే ఉంది. ఎంపీ అభ్యర్థులుగా తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్‌ పేర్లు బాగా వినిపిస్తున్నందున అప్పుడు తామే ఎమ్మెల్యే అభ్యర్థులమవుతామన్న భావనలో వారున్నట్లు ప్రచారంలో ఉంది. ఇచ్ఛాపురంలో మరో విచిత్రమైన పరిస్థితి ఉంది. అక్కడ ప్రధాన పార్టీలకు కాకుండా ఇతర పార్టీలకు కార్యాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా వైసిపికి బహు నాయకత్వంతో పాటు టిక్కెట్ల ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. అందువల్ల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తే నిర్వహణా భారం ఎవరు చూడాలి. టిక్కెట్‌ రాకుంటే చేతులు కాల్చుకోవడమే అవుతుందని ఎవరికి వారు భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే ఎవరూ పార్టీ కార్యాలయం ఆలోచన చేయడం లేదని తెలిసింది. వారికి ఇళ్లే కార్యాలయాలుగా ఉన్నాయని చెప్తున్నారు.