ప్రజాశక్తి-చౌడేపల్లి : గురువులు ఎక్కడ ఉన్న పూజింపబడతారని యువ కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు మిద్దింటి కిషోర్ అన్నారు. స్థానిక ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఈశ్వర్ రెడ్డి ఆయనతోపాటు మరో ఆరుగురు ఉపాధ్యాయులు బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్లారు. బదిలీపై వెళ్లిన వారికి స్థానిక ఉన్నత పాఠశాలలో ఘనంగా సన్మానం నిర్వహించారు. తొలుత ప్రధానోపాధ్యాయుడు ఈశ్వర్ రెడ్డిని ఓపెన్ టాప్ కారులో పూల జల్లులతో ఊరేగించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో మిద్దింటి కిషోర్ ప్రసంగిస్తూ జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత పూజింపబడతారని ఆయన అన్నారు. సమాజం దిశా నిర్దేశం చేసేది గురువులే అన్నారు. ప్రస్తుతం బదిలీపైన వెళ్లే ఉపాధ్యాయులకు ఘన వీడ్కోలు లభించడం వారికి ఇక్కడి విద్యార్థులకు ఉన్న సంబంధం ఏమిటో అర్థం అవుతుందన్నారు. జీవిత సర్వస్వం విద్యా బోధనకే అంకితం అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ బదిలీపై వెళ్లడంతో మైసూరులో విద్యార్థులే జట్కా బండిని లాగుతూ పురవీధుల్లో పూరేగించారని అదే తరహాలో ప్రధానోపాధ్యాయుడు ఈశ్వర్ రెడ్డిని ఊరేగించడం సంతోషదాయకంగా ఉందన్నారు. స్థానిక ఉన్నత పాఠశాలను ఎంతో అభివృద్ధి పరచిన ఈశ్వర్ రెడ్డి ఆదర్శప్రాయుడన్నారు. అనంతరం ఆయనతోపాటు బదిలీపై వెళుతున్న అందరిని మిద్దింటి కిషోర్ ఘనంగా సన్మానించారు. ఎంపీపీ గాజుల రామ్మూర్తి గడ్డం వారి పల్లి ఎంపీటీసీ శ్రీరాములు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మురళి ఉమాశంకర్ రెడ్డి రాజేంద్ర ఉపాధ్యాయులు స్థానికులు విద్యార్థులు పాల్గొన్నారు.










