Dec 06,2022 22:42

హోంగార్డ్‌ ఆవిర్భావ దినోత్సవ సభలో మాట్లాడుతున్న జిల్లా ఎస్‌పి


హోంగార్డ్‌ సేవలు ప్రశంసనీయం: ఎస్‌పి

ప్రజాశక్తి - చిత్తూరుఅర్బన్‌

హోంగార్డుల ఆవిర్భవ దినోత్సవం కార్యక్రమంను పోలీసు పరేడ్‌ మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్‌ పి రిశాంత్‌ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. పెరేడ్‌ ను పరిశీలించి హౌంగార్డుల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడ పోటిలలో విజేతలైన వారికి, విధుల్లో ప్రతిభ కనబరచిన హౌంగార్డ్‌ లకు సర్టిఫికెట్స్‌, మొమెంటోలు బహుకరించారు. ఈ సందర్భంగా ఎస్‌ పి మాట్లాడుతూ దేశంలో హౌం గార్డ్‌ వ్యవస్థ 1946 సంవత్సరంలోనే ప్రారంభం అయ్యిందని, ఆ తర్వాత 1963 వ సంవత్సరంలో డిసెంబర్‌ 6 వ తేదీన ఈ వ్యవస్థ బాధ్యతాయుతమైన పౌరులు సమాజానికి స్వచ్చంద సేవ చేయుటకు పురుడు పోసుకుందని తెలిపారు. హౌంగార్డ్స్‌ ప్రజలకి పోలీసులకి వారధులుగా పని చేయాలని తెలిపారు. పోలీసులతో పాటు ఏమాత్రం తీసిపోని విధంగా హౌంగార్డులు సేవలు అందిస్తుండటం అభినందనీయ మన్నారు. పోలీసుశాఖ క్రమశిక్షణకు మారుపేరని... నిత్యం క్రమ శిక్షణతో మెలుగుతూ పోలీసు ప్రతిష్టను పెంచేలా విధులు కొనసాగాలన్నారు. చిత్తూరు జిల్లాలో శాంతి భద్రతల కోసం 661 మంది హౌంగార్డ్స్‌ విధులను నిర్వహిస్తున్నారని, వీరితో పాటు 227 హౌంగార్డ్స్‌ వివిధ విభాగాల నందు డెప్యుటేషన్‌ పనిమీద చేస్తున్నారన్నారు. చిత్తూరు జిల్లా నందు హౌంగార్డ్స్‌ బెనిఫిట్‌ ఫండ్‌ ను ఏర్పరచి ఆ ఫండ్‌ సహాయంతో ఎవరైనా హౌంగార్డ్స్‌ గాయపడితే రూ 30వేలు, మరణిస్తే తక్షణ సహాయంగా రూ 4 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. రిటైర్‌ అయ్యే సందర్భంలో నాలుగు లక్షల రూపాయలను కానుకగా ఇచ్చి సత్కరిస్తామన్నారు. ఈ మధ్య కాలంలో అనారోగ్యం కారణంగా హౌం గార్డ్స్‌ మరణించారన్నారు. అందువలన ప్రస్తుతం హౌం గార్డ్‌ యూనిట్‌ నందు 249 మంది 40 సంవత్సరాల పై బడిన వారు ఉన్నారని, వీరికి త్వరలో మెడికల్‌ టెస్ట్‌ లు నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో చనిపోయిన ఇద్దరికి సంబంధించి వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున అందించారు. వైద్య సేవ కింద 661 మందికి గాను 639 మందికి హెల్త్‌ కార్డ్స్‌ అందించారు.