గుంతకల్లు రూరల్ : హంద్రీనీవా ద్వారా చెరువులు ఒక్కటే నింపితే ప్రయోజనం లేదని, దాని ద్వారా సాగునీరు ఇస్తేనే రైతులకు ప్రయోజనం చేకూరుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ తెలిపారు. గత రెండు రోజులుగా వజ్రకరూరు మండలం రాగులపాడు లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి పిల్లకాలువలు ఏర్పాటు చేసి సాగునీటిని అందించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర గురువారం ముగిసింది. ముగింపు సందర్భంగా గుంతకల్లు ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాంభూపాల్ మాట్లాడుతూ హంద్రీనీవా చెరువులు నింపడానికి మాత్రమే కాదని, ఆ నీరు పొలాల్లోకి పారినప్పుడే రైతులకు ప్రయోజనం ఉంటుందన్నారు. కాలువల మరమ్మతులకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైనప్పటికీ పిల్ల కాలువలు ఏర్పాటు చేయకపోవడం చూస్తుంటే రైతులపై పాలకులకు ఏపాటి చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు పంటలు చేతికందక పెట్టుబడులు కూడా రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని చెప్పారు. ఈ భారాన్ని భరించలేక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారిక లెక్కల ప్రకారం ఈ సంవత్సరం 206 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే రైతుల పరిస్థితి ఎంతదయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. భూగర్భ జలాలు తగ్గి బోరుబావులు కూడా ఎండిపోతున్నాయన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గ్రామాలను అనుకుని పారుతున్న హంద్రీనీవా జలాలను కేవలం చెరువులను నింపడానికే కాకుండా పొలాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 2007 సంవత్సరంలో మల్లెల నుంచి ప్రారంభించిన లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అనంతపురం వరకు నీరు తీసుకురావడానికి ఆయన విద్యుత్ ఖర్చు రూ.22 వేల కోట్లు అన్నారు. ఇంత ఖర్చు చేసినా ఒక్క ఎకరాకు కూడా సాగునీరు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. రాగులపాడు లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి ఉరవకొండ, వజ్రకరూరు, గుంతకల్లు, పామిడి తదితర లోతట్టు ప్రాంతాలకు సాగునీరు ఇస్తే 12వేల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని చెప్పారు. రాగులపాడు వద్ద రెండు కాలువలు ఏర్పాటు చేసి ఒక కాలువ ద్వారా ఉరవకొండ వైపు, రెండవ కాలువ ద్వారా గుంతకల్లు, పామిడి, వజ్రకరూరు మండలాలకు నీరు అందించవచ్చని చెప్పారు. ఈ దిశగా పాలకులు ఎందుకు దృష్టి సారించడం లేదని ప్రశ్నించారు. పాలకులకు ఎన్నికల మీద ఉన్న దష్టిలో పదిశాతం కూడా రైతు సమస్యలపై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో 21 మండలాల్లో కరువు తాండవిస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం నాలుగు గంటలు కూడా నాణ్యమైన విద్యుత్‌ను అందించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేయడం మరింత దుర్మార్గం అన్నారు. వ్యవసాయ అనుబంధ కూలీలకు కరువు దష్ట్యా 200 రోజులు పని దినాలు కల్పించాలన్నారు. సాగునీటిపై పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఈనెల 30వ తేదీ నుంచి 4వ తేదీ వరకు సిపిఎం ఆధ్వర్యంలో నిరవధిక ఉద్యమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి హంద్రీనీవా డిస్ట్రిబ్యూటరీ కాలువ మరమ్మతు పనులు పూర్తి చేసి చెరువులకు నీరు ఇవ్వడంతో పాటు పొలాలకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవో రవీంద్రకు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బి.శ్రీనివాసులు, డి.శ్రీనివాసులు, దాసరి శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శి మారుతి ప్రసాద్, సిఐటియు పట్టణ కార్యదర్శి సాకే నాగరాజు, మండల కార్యదర్శి సి.రమేష్, సిఐటియు పట్టణ అధ్యక్షుడు బి.తిమ్మప్ప, వజ్రకరూరు మండల కార్యదర్శి విరుపాక్షి, ఉరవకొండ కార్యదర్శి రంగారెడ్డి, ఐద్వా నాయకురాలు జ్యోతి, కార్యకర్తలు చంద్ర, ఓబులేష్ పాల్గొన్నారు.










