Aug 02,2023 22:26

జిల్లాలోకి హంద్రీనీవా నీటి పంపింగ్‌ (ఫైల్‌ ఫొటో)

     అనంతపురం ప్రతినిధి : సాగునీటి ప్రాజెక్టులపై అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలోనే ప్రాజెక్టుల పరిశీలనను ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు చేపట్టిన రాయలసీమ యాత్ర మరింత రాజకీయ వేడిని రాజేస్తోంది. తమ హయాంలో ప్రాజెక్టులు చేపట్టామంటే తమ హయాంలో అని సవాళ్లు విరుసుకుంటున్నారు. ప్రాజెక్టులు సాధించిన ఘనత తమదంటే తమదని మాటల యుద్ధాన్ని సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాయలసీమ అత్యంత దుర్భిక్ష ప్రాంతానికి ఎవరి హయంలో ఏ మేరకు పనులు సాగాయన్నది రేఖమాత్రంగా పరిశీలిద్దాం
దుర్భిక్ష ప్రాంతాలుగానున్న రాయలసీమ జిల్లాలకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చే నిమిత్తం సర్‌ అర్థార్‌ కాటన్‌ హయాంలో హంద్రీనీవా అన్న ఆలోచన పుట్టింది. 1980 తరువాత ఎన్టీ.రామారావు ముఖ్యమంత్రిగానున్న సమయంలో ప్రాజెక్టు రూపకల్పనకు అవసరమైన ప్రణాళికకు తొలి అడుగు పడింది. అయితే ప్రాజెక్టు పనులు చేపట్టే దశకు చేరుకోలేదు. 1996లో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు అయ్యాక 11 మార్చి 1996లో తొలిసారిగా దీనికి శంకస్థాపన చేశారు. కాని పనులు ప్రారంభమవలేదు. 1999లో మరోమారు ఆయనే శంకుస్థాపన చేశారు. అప్పుడు కూడా పనులు మొదలవ్వలేదు. 2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి 2005లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2006లో రెండో దశకు శంకస్థాపన చేశారు. అప్పటి నుంచే పనులు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి పనులు సాగుతూనే ఉన్నాయి. సంపూర్తిగా ఈ పనులు ఇప్పటికీ పూర్తవలేదు. వస్తున్న డిమాండ్ల ఆధారంగా పనులను పెంచుకుంటూ పోతూనే ఉన్నారు.
2012 నుంచి హంద్రీనీవా నీళ్లు
2005వ సంవత్సరం నుంచి పనులు ప్రారంభమైనప్పటికీ 2012లో తొలిదశ పనులు పూర్తయ్యాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగానున్న సమయంలో 2012లో ట్రయల్‌రన్‌ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏటా శ్రీశైలం నుంచి అనంతపురం జిల్లాకు హంద్రీనీవా ద్వారా నీరుస్తొంది. కరువు పరిస్థితుల్లోనూ తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువకు తోడు ఈ నీరు రావడంతో జిల్లా సాగు, తాగునీటి అవసరాలు కొంత మేరకు తీరుతున్నాయి. అయితే ఈప్రాజెక్టును మరింత విస్తరించాలన్న డిమాండ్‌ వస్తూనే ఉంది. ఎందుకంటే ప్రారంభంలో చేపట్టిన 40 టిఎసిల సామర్థ్యం మేరకు నీటిని తీసుకోలేని పరిస్థితులున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ప్రధాన కాలువల వెడల్పునకు డిమాండ్‌ ఉంది. ఈ ప్రభుత్వం వెడల్పు చేస్తున్నట్టు ప్రకటించినా పనులు మాత్రం ప్రారంభించలేదు.
ఎవరి హయంలో ఎన్ని నిధుల కేటాయింపులు
వ.సం. సంవత్సరాలు అధికారంలోనున్న పార్టీ నిధుల కేటాయింపులు (కోట్లలో)
1. 1991-1995 కాంగ్రెసు పార్టీ 2..50
2. 1995-2004 టిడిపి 21.22
3. 2004-2009 కాంగ్రెసు 3156.89
4. 2009-2014 కాంగ్రెసు 3153
5. 2014-2019 టిడిపి 5625.25
6. 2019-2023 వైసిపి (ప్రస్తుతం) 1926.07