Feb 13,2023 15:17

ప్రజాశక్తి - పలమనేరు : సోషల్ మీడియా వేదికగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇప్పుడు బతికి ఉంటే చంపుతానంటూ అనుచితంగా మాట్లాడిన మనువాద మతోన్మాద హమారా ప్రసాద్ ను కఠినంగా శిక్షించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నూరు  ఈశ్వర్, ఐద్వా జిల్లా కన్వీనర్ భువనేశ్వరి, ఓబుల్ రాజు డిమాండ్ చేశారు. సోమవారం పలమనేరు పట్టణ  స్థానిక డాక్టర్ బి.ఆర్ అంటేద్కర్ సర్కిల్ నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఈ సందర్భం వారు మాట్లాడుతూ హమారా ప్రసాద్ పై ఎస్సీ ఎస్టీ హత్యాచార నిరోధక చట్టం కింద నమోదు చేసి ఇలాంటి దుర్మార్గమైన కుల దుహంకార దారుణమైన వ్యాఖ్యలు మరొకరు ఇలా మాట్లాడకుండా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బిజెపి కార్యకర్త, మనువాద మతోన్మాది హమారా ప్రసాద్ నిరంతరం తాను చేస్తున్న చిల్లర పనులకు తోడుగా తన పాపులారిటీ ఇమేజ్ ని పెంచుకోవడం కోసం అంబేద్కర్ బ్రతికి ఉంటే గాంధీని గాడ్సే కాల్చినట్లే నేను కూడా అంబేద్కర్ ని కాల్చి చంపేవాడినని బహిరంగంగా ప్రకటించడాన్ని ఉపేక్షించరాదన్నారు. ఇది జాతికి జరిగిన అవమానంగా పరిగనించి ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలన్నారు. జాతీయ నాయకులను కించపరిచే వారి పట్ల కఠినంగా వ్యవహారించాలని లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ పై మదమెక్కి మాట్లాడడం దేశ ప్రతిష్టికే అవమానకరమని, అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారిని క్షమించబోమని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని వారిపై కఠినమైన చర్యలు పలమనేరు సిఐకి ఫిర్యాదు చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా నాయకులు పాకాల సుబ్రహ్మణ్యం, గుర్రం సుబ్రహ్మణ్యం, శివ, సోమశేఖర్, మంజు, భవాని తదితరులు పాల్గొన్నారు.