సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.నాగేంద్రకుమార్
అనంతపురం కలెక్టరేట్ : బేవరేజ్ హమాలీల సమస్యలను పరిష్కరించడంలో మద్యం కంపెనీల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కామేశ్వరరావు అనుసరిస్తున్న వైఖరి సరికాదని, హమాలీ అసోసియేషన్ నేతలపై ఆయన దురుసుగా వ్యవహరిస్తే సహించేది లేదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.నాగేంద్రకుమార్ తెలిపారు. హమాలీ యూనియన్ నేతల పట్ల మద్యం కంపెనీల అసోసియేషన్ అధ్యక్షుడు కామేశ్వరరావు అనుసరించిన వైఖరిని తప్పుపడుతూ గురువారం సిఐటియు ఆధ్వర్యంలో సోములదొడ్డి ఐఎంఎల్ డిపో వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాగేంద్రకుమార్ మాట్లాడుతూ 2023 జూన్ 14వ తేదీకి హమాలీ దిగుమతి కూలిరేట్లు ఒప్పందం చేసుకునే విషయంపై విజయవాడకు వస్తానని కామేశ్వరరావు 10-06-2023వ తేదీన బేవరేజ్ హమాలీ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కె.ఉమామహేశ్వరరావుకు నేరుగా లేఖ వాట్సప్ ద్వారా పంపించారన్నారు. ఆ మేరకు 14వ తేదీన సమావేశానికి వస్తున్నారా అంటూ ఉమా మహేశ్వరరావు ఫోన్‌లో మాట్లాడారని, కూలీ రేట్ల పెంపుదలలో 60 పైసలు పెంపుదల చేస్తామని, ఆ మేరకు సంఘం నేతలు ఒప్పుకుంటేనే సమావేశానికి వస్తానంటూ కామేశ్వరరావు లేకపోతే రానంటూ షరతులు విధించడం విడ్డూరంగా ఉందన్నారు. సంఘాల నుంచి అభిప్రాయం తెలియజేయలేదంటూ సాకులు చెప్పి సమావేశానికి రాలేదన్నారు. ఒప్పందం చేసుకునే సమయంలో తొలుత చర్చలు జరిపిన తరువాతనే ఏదైనా నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం ఆనవాయితీ అన్నారు. హమాలీల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం మద్యం కంపెనీ అసోసియేషన్ నాయకుడిగా కామేశ్వరరావుకి మంచిదికాదన్నారు. కామేశ్వరరావు వైఖరి మార్చుకుని సంఘం నేతలకు క్షమాపణలు చెప్పి సమావేశానికి హాజరై హమాలీల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కూలీ రేట్లు పెంచాలని లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బేవరేజ్ హమాలీ యూనియన్ గౌరవాధ్యక్షులు రామాంజినేయులు, అధ్యక్ష కార్యదర్శులు మోహన్‌రెడ్డి, నాగార్జున, నాయకులు అంజనేయులు, చెన్నారెడ్డి, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.










