ప్రజాశక్తి - తణుకురూరల్
ఎపిఎస్‌ఎస్‌డిసి అధికారుల ఏకపక్ష నిర్ణయాలు మానుకోవాలని, హమాలీలకు న్యాయం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం తహశీల్దార్ కార్యాలయం వద్ద ఎపిఎస్‌ఎస్‌డిసి హమాలీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, అనంతరం తహశీల్దార్ పిఎన్‌డి.ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ తణుకు ఎపిఎస్‌ఎస్‌డిసి యూనిట్‌లో 15 మంది హమాలీలు అనేక సంవత్సరాలుగా సేవలందిస్తున్నారన్నారు. ప్రతి రెండు సంవత్సరాలకోసారి రేట్ల పెంపుదల జరుగుతుందన్నారు. ఎపిఎస్‌ఎస్‌డిసి సంస్ధలు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 18 యూనిట్లు ఉన్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పని విధానం ఉన్నప్పటికీ ఒకే అగ్రిమెంట్ అనేది లేదని అన్నారు. ఒక్కోక్క చోట ఒక్కో అగ్రిమెంట్ విధానం ఉందని తెలిపారు. అనేక సంవత్సరాలుగా శ్రీకాళహస్తి హమాలీ రేట్లు అమలు చేయాలని కోరారని తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా లేని టెండర్ విధానం తణుకు యూనిట్ హమాలీ కార్మికులపై కక్ష సాధించడానికి తీసుకొచ్చారని విమర్శించారు. ఈ విషయాలు పరిగణించి హమాలీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కామన మునిస్వామి, టి.రామకృష్ణ గాది త్రిమూర్తులు, రమణ, సాంబశివరావు, బి.శ్రీహరి పాల్గొన్నారు.










