Oct 26,2023 19:18

ధర్నా చేస్తున్న నాయకులు

ధర్నా చేస్తున్న నాయకులు
హమాలీ కార్మికుల కూలిరేట్లను పెంచాలి
ప్రజాశక్తి-కోవూరు:స్థానిక ఇనమడుగు సెంటర్‌ చుట్టుపక్కలనున్న ప్రయివేటు గోదాములలో అనేక సంవత్సరాల నుంచి పనిచేయుచున్న హమాలీ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో కూలి రేట్లు పెంచాలని డిమాండ్‌ చేస్తూ గత నెల రోజుల నుండి సమ్మె కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. యాజమాన్యంతో పలు దఫాలు చర్చలు జరిపినా ఫలించకపోవడంతో గురువారం నుంచి ఇనమడుగు రోడ్డులోని బాలాజీ వేర్‌ హౌసింగ్‌ గోదాముల ఎదుట నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా సిఐటియు నెల్లూరు నగర కార్యదర్శి జి. నాగేశ్వరరావు, సిపిఎం కోవూరు మండల కార్యదర్శి గండవరపు శేషయ్యలు మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టకుండా మొండిగా వ్యవహరించడంతో విధి లేని పరిస్థితుల్లో కార్మికులు ఆందోళన బాట పట్టారని తెలిపారు. జిల్లాలో అన్ని గోదాములలో బస్తాకు ఏడు రూపాయల కూలి ఇస్తున్నారన్నారు. ఇనమడుగు సెంటర్లోని గోదాములలో 2 రూపాయల 90 పైసలు ఇచ్చి అనేక సంవత్సరాల నుంచి కార్మికుల శ్రమను దోచుకుంటున్నారన్నారు
. మిగతా గోదాములలో ఇచ్చిన విధంగానే ఇనమడుగు సెంటర్‌ హమాలీ కార్మికులకు కూడా కూలి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గత 30 సంవత్సరాల పైబడి గోదాములలో కార్మికులు పనిచేస్తుంటే స్థానికులను కాదని, ఇతర రాష్ట్రాల నుంచి హిందీ కార్మికులను తీసుకువచ్చి స్థానికులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. స్థానికులకు పని కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎస్‌.అంకయ్య, సిహెచ్‌.దామోదర్‌ రెడ్డి, అల్లంపాటి శ్రీనివాసులరెడ్డి, అర్జున్‌, హరి, ఆవాజ్‌ నాయకులు చాన్‌బాషా, ఇనమడుగు సెంటర్‌ హమాలీ వర్కర్‌ సీనియర్‌ నాయకులు ఆదేయ్య, మధు, చింటూ, వెంకయ్య, చంటి, శ్రీకాంత్‌, శివ, వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు.