Oct 03,2023 22:33

కూన రవికుమార్‌ను అరెస్టు చేసి తరలిస్తున్న పోలీసులు

* టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు
* ర్యాలీ భగ్నానికి పోలీసుల యత్నం
* పలువురు నాయకుల ముందస్తు అరెస్టు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌ : 
రాజ్యాంగం కల్పించిన హక్కులను రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం కాలరాస్తోందని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు, జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ విమర్శించారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, నాయకులు బండారు సత్యనారాయణ మూర్తి అరెస్టును నిరసిస్తూ శ్రీకాకుళం నగరంలో మంగళవారం నిర్వహించిన తలపెట్టిన ర్యాలీని పోలీసులు భగం చేసేందుకు యత్నించారు. ఇందులో భాగంగా ర్యాలీకి బయలుదేరుతున్న కళా వెంకట్రావును ఎచ్చెర్లలో పోలీసులు అడ్డుకున్నారు. కూన రవికుమార్‌ను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు పలాస పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందన్నారు. నిర్బంధాలు, కక్షపూరిత చర్యలకు భయపడేది లేదన్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టినా ఇంతవరకు ఒక్క సాక్ష్యం కూడా ప్రభుత్వం చూపించలేకపోయిందని చెప్పారు.
ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, మాజీ ఎమ్మెల్యే గుండ లకీëదేవి ఆధ్వర్యాన టిడిపి శ్రేణులు నగరంలోని ఏడు రోడ్ల కూడలి నుంచి ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా టిడిపి నాయకులు సూర్యమహల్‌ వద్ద రోడ్డుపై బైఠాయించారు. బైఠాయించిన వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా ఎమ్మెల్యే అశోక్‌ వారితో వాగ్వివాదానికి దిగారు. అయినా పోలీసులు వారిని పోలీసు వాహనాల్లో ఎక్కించి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. అయినా పట్టు వీడని టిడిపి నాయకులు 80 అడుగుల రోడ్డు వరకు ర్యాలీని కొనసాగించారు. ర్యాలీలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, కలమట సాగర్‌, ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు, మాదారపు వెంకటేష్‌, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్ను నాగార్జున ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు.