Jul 25,2023 21:24

విద్యార్థినులతో మాట్లాడుతున్న రమాదేవి

          అనంతపురం కలెక్టరేట్‌ : దేశంలో మహిళలపై అత్యాచారాలు, దాడులు, హత్యలు, హింస పెరిగిపోతోందని ఇలాంటి పరిస్థితుల్లో హింసలేని సమాజాన్ని నిర్మించుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి పిలుపునిచ్చారు. మణిపూర్‌లో మారణ హోమాన్ని ఆపాలని ఐద్వా ఆధ్వర్యంలో బిసి బాలికల వసతిగృహంలో విద్యార్థినులతో మంగళవారం ఉదయం సెమినార్‌ నిర్వహించారు. ఐద్వా బాలికల వసతిగృహం వార్డెన్‌ శీరీష అధ్యక్షతన నిర్వహించిన సెమినార్‌కు ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో మహిళలపై రోజురోజుకూ హింస పెరిగిపోతోందన్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధ వరకు అందరూ దాడులకు, అత్యాచారాలకు గురవుతున్నారని తెలిపారు. దేశంలో ఇటీవల మణిపూర్‌లో జరిగిన మారణహోమం వంటి సంఘటన మునుపెన్నడు జరగలేదన్నారు. మానవ సమాజం సిగ్గుపడే అంతలా అక్కడ దారుణాలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల్ని వివస్త్రలను చేసి నగంగా ఊరేగించి అత్యాచారం హత్య చేయడం మానవ సమాజానికే మాయని మచ్చ అన్నారు. సాంకేతికంగా అభివృద్ధి సాధించామని ఆనందపడాలో అదే సాంకేతికత, ఇంటర్‌నెట్‌ను అనవసర అంశాల పట్ల వినియోగించి ఇలా మహిళల్ని, పిల్లలను ఇబ్బందులు, హత్యలు చేస్తున్నందుకు ఆందోళనపడే దుస్థితి ఏర్పడుతోందన్నారు. విద్యార్థినులు సమాజంలో జరుగుతున్న విషయాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అపరిచులతో మాట్లాడటం, పరిచయాలు పెంచుకోవడం వంటివి చేయరాదన్నారు. ఇంటర్‌నెట్‌ను చదువులు, అభ్యున్నతి కోసం మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు. ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆశయాలను సాధించేందు విద్యార్థినులు బాగా చదువుకుని ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిసి బాలికల హాస్టల్‌ వార్డెన్‌ రాజేశ్వరి, ఐద్వా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్యామల, రాజేశ్వరి, జిల్లా ఉపాధ్యక్షులు రామాంజినమ్మ, సిబ్బంది పుష్ప, భారతి, హేమలత, సుజాత, విద్యార్థినులు పాల్గొన్నారు.
మణిపూర్‌ మారణహోమాన్ని ఆపాలి
మణిపూర్‌లో జరుగుతున్న అవమానవీయ సంఘటనలు, మారణహోమాన్ని ఆపి, శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి డిమాండ్‌ చేశారు. మంగళవారం నాడు అనంతపురంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. మణిపూర్‌లో జరిగిన సంఘటన దేశానికే సిగ్గుచేటుగా ఉందన్నారు. ఇద్దరు మహిళల్ని నగంగా ఊరేగించి అత్యాచారం, హత్య చేయడం దుర్మార్గంగా ఉందన్నారు. మణిపూర్‌లో ఇంత మారణకాండ జరుగుతున్నా ప్రధాని నరేంద్రమోదీ మౌనం వహించడం సిగ్గుచేటన్నారు. మే 4న ఘటన జరిగితే ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు కాలేదన్నారు. ఈ వీడియోలు రెండు నెలల తరువాత సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి వచ్చాయన్నారు. మణిపూర్‌ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించిన తరువాత ప్రధాని నామమాత్రపు విచారం వ్యక్తం చేశారన్నారు. దేశానికి రక్షణగా పని చేసిన సైనికుడి కుటుంబానికే అక్కడ రక్షణ లేకుండా పోయిందన్నారు. స్వాతంత్య్ర సమరయోదుడి భార్యను ఇంటితో సహా దహనం చేశారంటే అక్కడి పరిస్థితులు ఏమిటో అర్థం చేసుకోవచ్చన్నారు. దేశంలో ఇలాంటి మారణకాండ జరిగినా నియంత్రించలేని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి అధికారంలో ఉండేందుకు అర్హత లేదన్నారు. రాబోయే రోజుల్లో మణిపూర్‌ మారణకాండ దేశమంతా అంటుకునే ప్రమాదం ఉందన్నారు. దీనిపై ప్రజలందరూ అప్రమత్తం కావాలన్నారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాద విధనాలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విద్వేషాలు లేని సమాజం, హింస లేని సమాజం నిర్మాణానికి అందరూ కృషి చేయాలని కోరారు.