బొమ్మనహాల్ : తుంగభద్ర హెచ్‌ఎల్సీ ప్రధాన కాలువకు మరోసారి గండిపడింది. గత 15 రోజుల క్రితం అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలంలో హెచ్‌ఎల్‌సి కాలువకు గండి పడింది. ఇది మరవకుండానే శనివారం నాడు కర్నాటక రాష్ట్రం కొలగండ్లు గ్రామం 78వ కిలోమీటర్ల వద్ద గండిపడింది. దీంతో పెద్ద ఎత్తున నీరు వృథా అయ్యింది. వెంటనే హెచ్‌ఎల్సీ అధికారులు స్పందించారు. నీటి ప్రవాహాన్ని తగ్గించి మరమ్మతు పనులు చేపట్టారు. కాగా ఇలా ప్రతి సారి కాలువకు గండ్లు పడి నీరు వృథా కావడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వర్షాలు లేక పంటలు పెట్టుకోలేకపోతున్నామని, ఇలాంటి సమయంలో సాగునీరు అందించే కాలువలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదంటున్నారు. తక్షణం కాలువలను పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.










