అనంతపురం కలెక్టరేట్ : తుంగభద్ర హెచ్‌ఎల్‌సి కాలువ ఆధునీకరణ పనులు చేపట్టితేనే రైతులకు ఉపయోగమని, లేకుంటా ఈ సారి కూడా రైతులకు పంట సాగుకు ఇబ్బందులు తప్పవని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ తెలిపారు. హెచ్‌ఎల్సీ కాలువ ఆధునీకరణ పనులు చేపట్టి, రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో అనంతపురం హెచ్‌ఎల్‌సి ఎస్‌ఇ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం జిల్లాకు ఏకైక సాగునీటి వనరు తుంగభద్ర డ్యాం అన్నారు. ఈ డ్యాం నుంచి హెచ్‌ఎల్‌సి కాలువ ద్వారా నీరు అందుతోందన్నారు. దశాబ్ధాల క్రితం నిర్మించిన ఈ కాలువ పూర్తిగా బలహీనపడిందన్నారు. కాలువ ఆధునీకరణ పనులు చేపట్టాలని ప్రభుత్వాలు నిర్ణయించి దశాబ్ధం గడిచినా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదన్నారు. దీనివల్ల జిల్లాకు రావాల్సిన నీటిని పూర్తిగా వినియోగించుకునే అవకాశాలు ప్రతి ఏడాదీ తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం జిల్లాలో సకాలంలో వర్షాలు రాకపోవడంతో నాలుగు లక్షల ఎకరాల్లో విత్తనం వేయని దుస్థితి నెలకొందన్నారు. జిల్లాలో సాగు భూమిలో మూడోంతులు విత్తన వేయలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కర్నాటకలో కురిసిన వర్షాల వల్ల తుంగభద్ర డ్యాంలో నీరు చేరిందన్నారు. ఇప్పటికీ 89 టిఎంసిల నీరు నిలువ ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఈ నీటిలో మన వాటా ప్రకారం విడుదల చేయాల్సి ఉందన్నారు. ఈ నెల 10వ తేదీ రాత్రి బొమ్మనహాల్ మండలం 113 కిలోమీటర్ దగ్గర హెచ్‌ఎల్‌సి ప్రధాన కాలువ నుంచి పెద్ద ఎత్తున లీకేజీ అయ్యిందన్నారు. ఈ లీకేజీని అరికట్టేందుకు నీటి విడుదల సామర్థ్యం తగ్గించారని తెలిపారు. తాత్కాలికంగా ఈ లీకేజీని ఆపేందుకు అధికారులు ప్రయత్నాలు చేశారని తెలిపారు. ప్రస్తుతం లీకేజీ జరుగుతున్న ప్రాంతానికి దగ్గరలో నాగలాపురం దగ్గర గత రెండు సంవత్సరాల క్రితం కాలువ మీద ఉన్న ఆ బ్రిడ్జి నిర్మాణం చేయలేదన్నారు. రైతులు వారి సొంత ఖర్చులతో కాలువలో మట్టి బస్తాలు వేసి తాత్కాలికంగా రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం నీరు వస్తుండడంతో మళ్లీ లీకేజీల ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. కాలువ చాలా చోట్ల బలహీనంగా ఉందన్నారు. ప్రభ్వుం, అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన కాలువ మరమ్మతు, నిర్వహణకు అవసరమైన నిధులు, సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరారు. కాలువ కింద వరి సాగు కోసం నారు వేశారని, అవి ముదిరిపోతున్నాయని తెలిపారు. కావున డిస్ట్రిబ్యూటర్లకు వెంటనే నీటిని విడుదల చేయాలని కోరారు. అనంతరం హెచ్‌ఎల్‌సి ఎస్‌ఇని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఓ.నల్లప్ప, ఎం.బాలరంగయ్య, జిల్లా కమిటీ సభ్యుడు వి.రామిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, భాస్కర్, మన్నీల రామాంజి, వెంకటనారాయణ, నగర కమిటీ నాయకులు ప్రకాష్‌రెడ్డి, వలి, మసూద్ తదితరులు పాల్గొన్నారు.










