Aug 12,2023 22:37

వి.రాంభూపాల్‌

        అనంతపురం కలెక్టరేట్‌ : హెచ్‌ఎల్‌సి కాలువ నిర్వహణ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల 14వ తేదీన హెచ్‌ఎల్‌సి ఎస్‌ఇ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ తెలిపారు. శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుంగభద్ర డ్యాం నుంచి హెచ్‌ఎల్‌సీకి నీరు విడుదల చేసిన వారం రోజుల్లోనే కాలువకు గండిపడిందన్నారు. బొమ్మనహాల్‌ మండలం ఉంతకల్లు గ్రామ సమీపంలో హెచ్‌ఎల్‌సి కాలువకు గండిపడి నీరు లీకేజీ అవుతున్న ప్రాంతాన్ని సిపిఎం పరిశీలించినట్లు తెలిపారు. జిల్లా ఏకైక సాగునీటి వసతి ఉన్న హెచ్‌ఎల్‌సి కాలువ నిర్వహణ అత్యంత నిర్లక్ష్యానికి గురైందన్నారు. 14 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఆధునీకరణ పనులు ఇప్పటీకీ పూర్తి కాకపోవడానికి పాలకుల అశ్రద్ధ ప్రధాన కారణమన్నారు. కర్నాటక రాష్ట్రంలోని 105 కిలోమీటర్ల కాలువ ఆధునీకరణ పనులు సంవత్సరంలోపు పూర్తి చేస్తే మన కాలువ పనులు ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం తుంగభద్ర నది పైబాగాన కురిసిన వర్షాల వల్ల డ్యాంకు నీరు చేరడంతో మన వాటా ప్రకారం రోజు మూడు వేల క్యూసెక్కులు తీసుకునే అవకాశం ఉందన్నారు. కాలవ సామర్య్థం సరిగా లేకపోవడంతో రోజుకు వెయ్యి క్యూసెక్కులకు మించి తీసుకునే పరిస్థితి లేదన్నారు. ఒక వైపు వర్షాభావంతో మూడోవంతు సాగుభూమిలో పంటలు వేయలేదన్నారు. మరోవైపు తుంగభద్రలో నీరు ఉన్న తెచ్చుకోలేని దుస్థితి ఉండడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరే కారణం అన్నారు. కాలువ నిర్వహణకు అవసరమైన సిబ్బంది లేరని, రిటైర్‌ అయిన వారి స్థానంలో కొత్త నియామకాలు లేవన్నారు. నీరు వచ్చిన తరువాత కాంట్రాక్ట్‌ అవుట్‌సోర్సింగ్‌ కింద లష్కర్‌లను రోజువారి కూలీలుగా తీసుకుంటున్నారని తెలిపారు. రోజు కూలీ రూ.350 ఇస్తున్నారని తెలిపారు. గతంలో పని చేసిన కాంట్రాక్ట్‌ కార్మికులకు సంవత్సరం తరువాత వేతనాలు ఇచ్చిరని తెలిపారు. ఇంత అస్తవ్యస్తంగా కాలువ నిర్వహణ ఉంటే పంట పొలాలకు నీరు ఎలా అందుతుందన్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు తక్షణం స్పందించి కాలువ నిర్వహణకు అవసరమైన నిధులు, సిబ్బందని తక్షణమే ఏర్పాటు చేయించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు. హెచ్‌ఎల్‌సి కాలువ నిర్వహణ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా 14వ తేదీన కలెక్టరేట్‌ ఎదుట నిర్వహిస్తున్న ధర్నాలో రైతులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.