Dec 01,2022 22:32

విద్యార్థులకు ఉన్న చట్టాలపై అవగాహన కల్పిస్తున్న జడ్జి కరుణకుమార్‌

హెచ్‌ఐవి బారిన పడొద్దు : మేయర్‌
ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌:
ఎయిడ్స్‌ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చిత్తూరు నగర పాలక సంస్థ మేయర్‌ ఆముదా పేర్కొన్నారు. గురువారం ఉదయం ప్రపంచ ఎయిడ్స్‌ నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రధాన ఆసుపత్రి నందు డిప్యూటీ మేయర్లు రాజేష్‌ కుమార్‌ రెడ్డి, చంద్రశేఖర్‌, అడిషనల్‌ డి యం అండ్‌ హెచ్‌ ఓ , జిల్లా క్షయ నివారణ అధికారి రవి రాజు లతో కలిసి ఎయిడ్స్‌ నిర్మూలన పై అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ జిల్లా ఆసుపత్రి నుండి చర్చి వీధి గుండా గాంధీ సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్వహించి ఎయిడ్స్‌ నిర్మూలనపై విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మేయర్‌ మాట్లాడుతూ ఎయిడ్స్‌ బారిన పడకుండా తగిన జాగ్రత్తలను పాటించినట్లయితే ఎయిడ్స్‌ సోకదని, ఎయిడ్స్‌ సోకిన వ్యక్తుల పట్ల వివక్షత చూపరాదని తెలిపారు. ఎయిడ్స్‌ సోకిన వ్యక్తులు భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్లు సూచించిన నిబంధనలు పాటిస్తూ మందులను సక్రమంగా వాడితే నయమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డిఎంహెచ్‌ఒ, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్‌ రవి రాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 1న ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. 2030 నాటికి ఎయిడ్స్‌ లేని రాష్ట్రంగా ఆంద్రప్రదేశ్‌ ఉండాలన్నదే ప్రభుత్వాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. జిల్లాలో గత సంవత్సరంలో 15 వేలమందికి ఎయిడ్స్‌ పరీక్షలు నిర్వహించగా 200 మందికి ఎయిడ్స్‌ ఉందని తేలిందన్నారు. అవసరమైన వారికి ప్రభుత్వ ఆసుపత్రుల నుండి మందులు అందజేయడం జరుగుతుందన్నారు. అనంతరం జిల్లా ఆసుపత్రి నందు ఈ కార్యక్రమంలో ఎయిడ్స్‌ నిర్మూలన పై గ్రామస్థాయి అవగాహన కల్పించి స్వచ్చంద సంస్థలకు, ఎన్‌.జి.ఓలకు సర్టిఫికేట్స్‌, జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టరు అరుణ కుమార్‌, డాక్టర్‌ సుధాకర్‌, డాక్టర్‌ గీత, డాక్టర్‌ రెడ్డెప్ప, ఎస్‌ వి మెడికల్‌ కళాశాల, అపోలో మెడికల్‌ కళాశాల నర్శింగ్‌ విద్యార్థులు, ఎన్జీవోలు పాల్గొన్నారు.
విద్యార్థులకు ఆరోగ్యమే మహాభాగ్యం: జడ్జి కరుణకుమార్‌
విద్యార్థి దశ నుండి చదువు తో పాటు బాలల హక్కులు, చట్టాలు, ఎయిడ్స్‌ పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి డాక్టర్‌ ఐ. కరుణ కుమార్‌ పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం జిల్లా విద్యాశాఖ అధికారి విజయేంద్ర రావు, ఎంఇఒ సెల్వరాజ్‌, లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ జస్వంత్‌లతో కలసి లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్‌ నందు నిర్వహించిన ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు ఆరోగ్యం చాలా ముఖ్యమని, ఆరోగ్యంగా ఉన్నపుడే మెదడు బాగా పనిచేస్తుందన్నారు. విద్యార్థులు మంచిని గ్రహించి, చెడును విడిచిపెట్టాలని, అప్పుడే విద్యార్థులు అనుకున్న స్థాయికి చేరుకోగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ నుండి డాక్టర్‌ సుదర్శన్‌, డాక్టర్‌ శ్రీవాణి పాల్గొన్నారు.