ప్రజాశక్తి-అనంతపురం హెచ్‌ఐవి సోకిన వ్యాధిగ్రస్థుల పట్ల వివక్ష చూపకుండా మనతోపాటు జీవించేందుకు సహకరించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వీరబ్బాయి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ కాండిలైట్ మెమోరియల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నగరంలో నిశ్శబ్ధ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హెచ్‌ఐవితో జీవిస్తున్న వ్యక్తుల పట్ల వివక్ష లేకుండా వారు కూడా మనలో ఒకరిగా ఉండేలా చూడాలన్నారు. హెచ్‌ఐవితో జీవిస్తున్న వారికి ఆదరణ, వారి హక్కుల కోసమే ప్రతిఏటా మేనెల మూడవ వారం అంతర్జాతీయ క్యాండిల్ లైట్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రారంభమై తెలుగు తల్లి తెలుగు తల్లి కూడలి వరకు వెళ్లి తిరిగి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ముగిసింది. ఈ కార్యక్రమంలో జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ ఆఫీసర్ డాక్టర్ అనుపమ జేమ్స్, అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి సుజాత, ఆర్డీటీ హెల్త్ డైరెక్టర్ సిరప్ప, అనంత నెట్‌వర్క్ పాజిటివ్ ప్రెసిడెంట్ వీరాంజనేయులు, జిల్లా సూపర్‌వైజర్ జివి.రమణ, హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సత్యనారాయణ, నారాయణస్వామి, షేర్ ఇండియా సుధాకర్, లింక్ వర్కర్స్ ప్రోగ్రాం రమేష్, ఓఆర్‌జి కేర్, వాలంటరీ హెల్త్ సర్వీసెస్, అనంత నెట్‌వర్క్ సిబ్బంది, రెడ్స్ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది, ఆశావర్కర్లు, ఆర్డీటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వీరబ్బాయి










