ప్రజాశక్తి -వలేటివారిపాలెం :మండలంలో జరుగుతున్న 167బి నెంబర్ జాతీయ రహదారి నిర్మాణంలో నాసిరకం మెటల్ ను వినియోగిస్తున్నారని కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు ఆరోపించారు. వలేటివారిపాలెం మండలం చుండి పంచాయతీ పరిధిలో రామలింగబోడు కొండ నుంచి మెటల్ తవ్వేందుకు బ్లాస్టింగ్ చేస్తున్నారని, దానివల్ల పర్యావరణం దెబ్బతినడంతో పాటు అయ్యవారిపల్లి ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయని గ్రామస్తులు ఇటీవల నాగేశ్వరరావు దష్టికి తీసుకొచ్చారు. దీంతో నాగేశ్వరరావు, పార్టీ నేతలతో కలిసి బుధవారం కొండ ప్రాంతాన్ని, అక్కడ నుంచి తరలిస్తున్న కంకరను పరిశీలించారు. అనంతరం నాగేశ్వరరావు మాట్లాడుతూ నాసిరకం కంకరను హైవే పనుల్లో ఉపయోగిస్తున్నారన్నారు. దానివల్ల రోడ్డు త్వరగా దెబ్బతినే అవకాశముందన్నారు. గత ఏడాది నవంబర్‌లో ఈ ఈ ప్రాంతంలోని సర్వేనెంబర్ 214 లో 4.8 హెక్టార్ల స్థలాన్ని 15 ఏళ్లపాటు కొంతమంది మైనింగ్ శాఖ నుంచి లీజు పొందారన్నారు. ఇక్కడ లభించే కంకరలో నాణ్యత లేదని, పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణంలో ఉపయోగించకూడదని గతంలో ఆ శాఖ అధికారులు తేల్చి చెప్పారని నాగేశ్వరరావు తెలిపారు. మరోవైపు రెవెన్యూ అధికారులు సిఫార్సు చేశారన్న కారణంతో గ్రామ సభ నిర్వహించకుండా, పంచాయితీలో సాధారణ సమావేశం నిర్వహించి ఆ తీర్మానంతోనే లీజుకు అనుమతి ఇచ్చారని నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై అక్కడి నుంచే పంచాయతీ కార్యదర్శి, అధికార పార్టీ సర్పంచ్ తో నాగేశ్వరావు ఫోన్లో మాట్లాడారు. నియోజకవర్గస్థాయి అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే లీజు ఇచ్చినట్టు అర్థమవుతుందన్నారు. అలా చేయడంలో ఆంతర్యం ఏమిటని సర్పంచ్ ను గట్టిగా ప్రశ్నించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు నాగేశ్వ రరావు తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మాదాల లక్ష్మీనరసింహం, గ్రామ పార్టీ అధ్యక్షులు ఆవుల నరేష్, నాయకులు చెరువుపల్లి మాల్యాద్రి, వలేటి నరసింహం వలేటి నరసింహం, ఘట్టమనేని లక్ష్మీనరసింహం, కాకుమాని ఆంజనేయులు, కాకుమాని హర్ష, కామినేని వీరయ్య, కామినేని అశోక్ కూడలి భాస్కర్, కామినేని రఘు, మన్నం మాధవ, సుబ్బారెడ్డి, గొర్రెపాటి మాధవ, మోహన్, చుంచు శీను, బక్కమంతల మాల్యాద్రి, మానికొండ కొండయ్య, సుబ్బానాయుడు ఉన్నారు.










