May 05,2023 22:10

విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి రోజా

         ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి   పేదలకు ఇళ్ల స్థలాలివ్వడంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు విపక్షాలకు చెప్పుదెబ్బ వంటిదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా ఘాటుగా విమర్శించారు. అనంతపురం నగరంలో పిస్తాహౌస్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాజధాని స్థలంలో పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలని వైసిపి ప్రభుత్వం ఆలోచిస్తే దాన్ని చంద్రబాబునాయుడు ఇవ్వకుండా అడ్డుపడే ప్రయత్నం చేసారని విమర్శించారు. ప్రజా రాజధాని అని అధికారంలో ఉండగా చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. ఆ రాజధానిలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలివ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారని తెలిపారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతిపక్షాలకు చెప్పుదెబ్బ వంటిదని ఎద్దేవా చేశారు. రాజధాని భూముల అవినీతిపైనా విచారణ జరగకుండా స్టే తెచ్చుకున్నారని, దానిపైనా ఇప్పుడు విచారణకు న్యాయస్థానం అనుమతినిచ్చిందని చెప్పారు. చంద్రబాబునాయుడు ఆయన అనుయాయులు పెద్దఎత్తున ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారన్నారు. అవన్నీ విచారణలో బయటకు రానున్నాయన్నారు. ఇక చంద్రబాబుకు అన్నీ రివర్సు జరుగుతున్నాయని, త్వరలో వాటిపై జైలుకెళ్లి చిప్పకూడు తినక తప్పదని పేర్కొన్నారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ఇప్పుడు రైతులకు ఏదో మంచి చేస్తున్నట్టు ప్రకటనలు ఇస్తున్నారన్నారు. రైతులకు అండగా ఉన్నది వైసిపి ప్రభుత్వమని చెప్పారు. ఏ సీజన్‌లో పంట దెబ్బతింటే అదే సీజన్‌లో రైతులకు పరిహారం అందివ్వటం జరుగుతోందన్నారు. ఈ నాలుగేళ్ల కాలంలలో రూ.1900 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీనివ్వడం జరిగిందని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల ఇళ్ల వద్దకే వచ్చి పంట కొనడం, అమ్మడం చేయడం జరుగుతోందని వివరించారు. ప్రజలకు మంచి చేస్తున్న జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి ప్రజల అండ ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారు అలీ తదితరులు పాల్గొన్నారు.