ప్రజాశక్తి-గుత్తి మండలంలోని జక్కలచెరువు గ్రామంలో ఉన్న గొందిపల్లి ఆంజనేయ స్వామి మాన్యం భూముల్లో వివాదం తలెత్తింది. జక్కలచెరువు గ్రామ పంచాయతీలోని గొందిపల్లి ఆంజనేయస్వామి ఆలయానికి సంబంధించి మాన్యం భూములు గొందిపల్లి గ్రామ శివారులో ఉన్నాయి. 1810 సంవత్సరం నుంచి భూములను అర్చకులు సాగు చేసుకుంటూ జక్కలచెరువు గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ధూప, దీప నైవేద్యాలు చేస్తున్నారు. అయితే బుధవారం గొందిపల్లి గ్రామానికి చెందిన కొందరు ఆ భూములు గొందిపల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయానికి సంబంధించినవని దౌర్జన్యంగా సేద్యం పనులు చేశారు. మాన్యం భూముల విషయంపై అర్చకులు హైకోర్టులో పిటీషన్ వేశారు. భూముల విషయం విచారించాలని హైకోర్టు దేవాదాయ శాఖను ఆదేశించింది. అయితే దేవాదాయ శాఖ నుంచి నివేదిక రాకముందే గొందిపల్లి వాసులు మాన్యం భూముల్లో దౌర్జన్యంగా ప్రవేశించి సేద్యం పనులు చేశారని అర్చకుడు రవికుమార్ ఆరోపించారు. గొందిపల్లి గ్రామస్తులు తమ భూముల్లో దౌర్జన్యంగా ప్రవేశించడంపై అర్చకుడు రవికుమార్ సిఐ ఎం. వెంకటరామిరెడ్డికి ఫిర్యాదు చేశారు. అప్పటి మద్రాసు ప్రభుత్వం ఆలయం జక్కలచెరువులో ఉందని రిజిష్టర్ 25లో పొందుపరిచిందని అర్చకుడు రవికుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు.










