Sep 28,2023 22:47

బూర్జ మండలం కొల్లివలస, సింగన్నపాలెం మధ్య అసంపూర్తిగా హై లెవల్‌ కెనాల్‌ పనులు

* ఇప్పటివరకు 80 శాతం పనులు పూర్తి
* భూసేకరణ చెల్లింపుల్లో జాప్యమే ప్రధాన కారణం
* డిసెంబర్‌ 31 నాటికి ముగియనున్న ఒప్పంద గడువు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: 
హైలెవల్‌ కెనాల్‌ పనులను ఎన్నికల షెడ్యూల్‌ లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. 2017లో మొదలైన పనులు ఒప్పందం ప్రకారం 2020 నాటికల్లా పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటివరకు 80 శాతం మాత్రమే పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్‌ 31వ తేదీ నాటికి పూర్తవుతుందని వంశధార ఇంజినీరింగ్‌ అధికారులు చెప్తున్నారు. మరో 20 శాతం మేర పనులను నాలుగు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. కాలువ తవ్వకాలకు సేకరించిన భూములకు చెల్లింపులు చేయకపోవడమే జాప్యానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. కాలువ తవ్వకాలకు కొన్నిచోట్ల కోర్టు కేసులూ ఉండడం మరో కారణంగా ఉంది. దీంతో ప్రస్తుతం పనులు మందకొడిగా సాగుతున్నాయి.
వంశధార, నాగావళి నదుల అనుసంధానంలో భాగంగా హిరమండలం రిజర్వాయర్‌ గట్టుకు రెండు తూములు ఏర్పాటు చేసి అక్కడ నుంచి 33.58 కిలోమీటర్ల మేర నారాయణపురం వరకు కాలువ తవ్వాల్సి ఉంది. హిరమండలం వద్ద నీటిని సరఫరా చేసే చోట 43.7 మీటర్ల స్థాయిలో, నారాయణపురం ఆనకట్ట వద్ద కాలువ కలిసే చోట 29.09 మీటర్లు నిర్మించేలా డిజైన్‌ చేశారు. తద్వారా ఏటవాలుగా నీరు ప్రవహించి ఆనకట్టకు చేరుతుంది. నదుల అనుసంధానం పూర్తి చేస్తే ఎల్‌ఎన్‌పేట, సరుబుజ్జిలి, బూర్జ మండలాల్లో ఉన్న ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీంతోపాటు నారాయణపురం ఆనకట్ట ప్రధాన కాలువల కింద ఉన్న 37,053 ఎకరాల ఆయుకట్టు స్థిరీకరణ జరుగుతుంది.
పెరిగిన ప్రాజెక్టు వ్యయం
వంశధార, నాగావళి నదుల పనులను రూ.84.90 కోట్ల వ్యయంతో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 27, 2017లో పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది. ప్రాజెక్టు పనులను నెల్లూరుకు చెందిన పి.వి రమణయ్య అండ్‌ కంపెనీకి రూ.57.99 కోట్లకు అప్పగించింది. అనుసంధాన పనులు 2020 నాటికే పూర్తి కావాల్సి ఉంది. పలుమార్లు ఒప్పంద కాలపరిమితిని పొడిగించిన ప్రభుత్వం, ఈ ఏడాది మార్చి 31వ తేదీకి పూర్తి చేసేలా పొడిగించింది. అంచనా వ్యయాన్ని సవరించి రూ.145.34 కోట్లకు పెంచింది. ఇప్పటివరకు రూ.85.71 కోట్లను వెచ్చించారు.
భూసేకరణ చెల్లింపుల్లో జాప్యం
హై లెవల్‌ కెనాల్‌ పనులకు సంబంధించి భూసేకరణ పూర్తయినా, ప్రభుత్వం నేటికీ రైతులకు డబ్బులు చెల్లించలేదని తెలుస్తోంది. కాలువ తవ్వకాలకు మరో 49.23 ఎకరాల భూమి అవసరమని అధికారులు గుర్తించారు. భూములు ఇచ్చేందుకు రైతులు అంగీకరించినా, ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదు. ఇందుకోసం రూ.8.26 కోట్లు కావాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం ఇప్పటివరకు నిధులు విడుదల చేయలేదని తెలుస్తోంది. అదీగాక వర్షాలు పడుతుండడం కూడా పనులు ముందుకు సాగడానికి కొంత ఆటంకంగా మారింది.
పనులు సకాలంలో పూర్తి కావడం సందేహమే
బూర్జ మండలం చినలంకాంలో కాలువ నిర్మాణం కోసం దేవాదాయ, ధర్మాదాయశాఖకు చెందిన సుమారు 7.5 ఎకరాలు అవసరం పడింది. వంశధార అధికారులు పరిహారం కింద దేవాదాయ, ధర్మాదాయశాఖకు రూ.1.50 కోట్లు చెల్లించేశారు. భూముల్లో 13 మంది రైతులు కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నారు. చట్టం ప్రకారం పరిహారంలో 60 శాతం దేవాదాయ, ధర్మాదాయశాఖకు, 40 శాతం కౌలు రైతులకు ఇవ్వాల్సి ఉంది. కౌలు రైతులకు పరిహారం చెల్లింపునకు సిద్ధమవుతున్న తరుణంలో ఆ భూములను ఆలయానికి ఇచ్చిన ధర్మదాత పరిహారం ఇవ్వాల్సి వస్తే తనకు ఇవ్వాలని, లేకుంటే దేవాదాయశాఖకు చెందాలంటూ కోర్టును ఆశ్రయించాడు. దీంతో బూర్జ మండలం చిన లంకాం పరిధిలో 700 మీటర్ల మేర కాలువ తవ్వకాలకు బ్రేక్‌ పడింది. నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గంలో కాలువ నిర్మిస్తామని అధికారులు చెప్తున్నారు. పనులు చేపడుతున్న తీరు, భూసేకరణ చెల్లింపుల్లో జాప్యం వంటి అంశాల వల్ల కెనాల్‌ పనుల పూర్తికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఒప్పందం ప్రకారం ఈ ఏడాది డిసెంబర్‌ 31వ తేదీ నాటికి పూర్యయ్యే పరిస్థితి కనిపించడం లేదు.