జిల్లా ఎస్‌సి, ఎస్‌టి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు సత్యసుధామ విచారణ
ప్రజాశక్తి - కాళ్ల
కాళ్ల ఎస్‌సి బాలుర హాస్టల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి కొవ్వాకుల తేజను హాస్టల్ కుక్ వెంకటేశ్వరరావు విచక్షణా రహితంగా కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లా ఎస్‌సి, ఎస్‌టి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు జిల్లెళ్ల సత్యసుధామ శుక్రవారం క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళితే రాజమండ్రికి చెందిన కొవ్వాకుల తేజ 20 రోజుల క్రితం కాళ్ల ఎస్‌సి బాలుర హాస్టల్లో చేరాడు. ఈ నెల 12వ తేదీన తేజ పుస్తకాలకు అట్టలు వేసుకోవాలని స్కూల్‌కు వెళ్లకపోవంతో స్కూల్‌కు వెళ్లాలని కుక్ వెంకటేశ్వరరావు చెప్పాడు. తేజ వినకపోయేసరికి వెంకటేశ్వరరావు పివిసి పైపుతో విచక్షణా రహితంగా కొట్టి గదిలో బంధించాడు. విద్యార్థులు స్కూల్ నుంచి వచ్చి గది తలుపు తీసి బయటకు తీసుకొచ్చి ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్‌కు వెళ్లి టిసికి దరఖాస్తు చేసి తేజను రాజమండ్రి తీసుకెళ్లిపోయారు. అనంతరం విషయాన్ని వారు జిల్లా ఎస్‌సి, ఎస్‌టి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు సత్య సుధామ జిల్లెళ్ల దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వసతి గృహాన్ని సందర్శించామని, హాస్టల్ వార్డెన్ ఇదంతా నిజమేనని చెప్పారని తెలిపారు. విద్యార్థులతో మాట్లాడామని, వెంకటేశ్వరరావు తరచూ విద్యార్థుల పట్ల సైకోలా ప్రవర్తిస్తాడని తెలిపారని చెప్పారు. నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.










