Jun 04,2023 23:25

విజయోత్సవ సభలో మాట్లాడుతున్న ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ప్రజాశక్తి-కళ్యాణదుర్గం : టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడు మరోసారి ప్రజలనుమోసం చేసేందుకు మహనాడులో హామీలు గుప్పించారని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఉషాశ్రీ అధ్యక్షతన జరిగిన వైసిపి నాలుగేళ్ల పాలన విజయోత్సవ సభకు మంత్రి పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంలో నిర్వహించిన గడగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మంత్రి ఉషాశ్రీచరణ్‌ సంపూర్ణంగా విజయవంతం చేశారని అభినందించారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఉషశ్రీ అధిక మెజార్టీతో గెలవబోతోందని జోస్యం చెప్పారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేసి సుపరిపాలన అందించిన సిఎంగా జగన్‌ పేరొందారన్నారు. చంద్రబాబు మహిళలకు కడియాలు, ఇంటికో ట్రాక్టర్‌ ఇస్తానని బూటకపు హామీలు గుప్పిస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే ఒంటరిగా పోటీచేయాలని సవాల్‌ విసిరారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జేపీ నడ్డ తదితర ప్రముఖలతో మంతనాలు చేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి జగన్‌ను సిఎంగా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, నియోజవర్గ పరిశీలకులు ఎంఆర్‌సి రెడ్డి, సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.