Oct 28,2023 23:17

ధర్నా చేస్తున్న మున్సిపల్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌: మున్సిపల్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహనరెడ్డి ఇచ్చిన వాగ్ధానం అమలు చేస్తారో? ఇచ్చిన హామీని భంగం చేస్తారో తేల్చి చెప్పాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జిల్లా ఉపాధ్యక్షులు అడుగుల గణేష్‌, ప్రధాన కార్యదర్శి ఎన్‌.బలరాం ప్రశ్నించారు. రెగ్యులర్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యాన జగనన్న వాగ్ధాన భంగాన్ని నిరసిద్ధాం పేరిట కార్మికులు శనివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2019 ఎన్నికలకు ముందు సిఎం జగన్మోహన్‌రెడ్డి తాను అధికారంలోకి వస్తే కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ అనే తేడా లేకుండా పర్మినెంట్‌ చేస్తానని హామీనిచ్చారని గుర్తు చేశారు. నాలుగున్నరేళ్లు గడచినా ఇంతవరకు హామీని అమలు చేయకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు పాతయాత్రలో అందరి ఆశీస్సులతో ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో అందరినీ రెగ్యులర్‌ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆయన హామీని నమ్మి ఓట్లేసి గెలిపిస్తే గత 20, 25 ఏళ్లుగా అవుట్‌ సోర్సింగ్‌ పనిచేస్తున్న వారందరినీ రెగ్యులర్‌ చేస్తానని చెప్పడంతో 151 సీట్లు గెలిపించామన్నారు. గెలిచిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అందలమెక్కితే కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను బానిసల్లాగా, వెట్టిచాకిరి చేస్తున్నారని విమర్శించారు. 11వ పిఆర్‌సి ప్రకారం కనీస వేతనం రూ.20 వేలు ఇవ్వాలన్నారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఢిల్లీ, ఒరిశా రాష్ట్రాల్లో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల తరహాలో రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ నగర కమిటీ నాయకులు ఆర్‌.జె.శేఖర్‌, ధనాల చిట్టిబాబు, ఎ.రాము, గురుస్వామి, పట్నాల ఈశ్వరమ్మ, డి.గంగ, బి.సరోజ పాల్గొన్నారు.