Sep 08,2023 23:00

మాట్లాడుతున్న రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు

* రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు
ప్రజాశక్తి - గార: 
పాదయాత్రలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన ఘనత తమదేనని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. మండలంలోని కొమరవానిపేటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగేళ్ల పాలనలో సంస్కరణలు, పాలనకు సంబంధించి మెరుగైన మార్పులు జన జీవన స్రవంతిని తెలుసుకునేందుకు వచ్చామన్నారు. జగన్‌ పాదయాత్రలో వచ్చినప్పుడు చెప్పినవన్నీ, వాటితో పాటే పరిశీలనలో ఉన్న మరికొన్నింటినీ జత చేసి తూచ తప్పకుండా అమలు చేశారని చెప్పారు. దేశంలో ఇంకే రాష్ట్రాలు మన రాష్ట్రం మాదిరిగా సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదన్నారు. ఏనాడైనా పేద వారి కోసం ఎకరా భూమి చంద్రబాబు కొన్నారా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో 20 వేల మందికి సొంతింటి కల నెరవేర్చామన్నారు. గత ప్రభుత్వ హయాంలో పథకం వర్తించాలంటే జన్మభూమి కమిటీ సభ్యులకు దండం పెట్టి మోకరిల్లాల్సి వచ్చేదన్నారు. ఈరోజు పథకాలకు ఎవరి సిఫార్సు లేకుండా అర్హతే ప్రామాణికంగా సచివాలయ వ్యవస్థ ద్వారా అందుతున్నాయని చెప్పారు. 14 ఏళ్ల పాటు అధికారం అందుకునే అవకాశం చంద్రబాబుకు ఇస్తే ఆయన ఏమీ చేయలేదని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ ఒక్క అవకాశం ఇవ్వాలని వేడుకుంటున్నా, ఆయన మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. మేలు చేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. కొమరవానిపేటలో వైసిపి హయాంలో రూ.9.2 కోట్లను అభివృద్ధి పనులకు వెచ్చించామన వివరించారు. గ్రామంలో మిగిలిన పనులను త్వరలో పూర్తి చేస్తామన్నారు. త్వరలోనే శ్మశానవాటిక సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో వైసిపి యువనేత ధర్మాన రామ్‌మనోహర్‌ నాయుడు, ఎంపిపి గొండు రఘురాం, నాటక అకాడమీ డైరెక్టర్‌ ముంజేటి కృష్ణ, తహశీల్దార్‌, ఎంపిడిఒ, పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.