Mar 29,2022 16:13

ప్రజాశక్తి-వడమాలపేట : తెలుగుదేశం పార్టీని స్థాపించి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మండల కేంద్రమైన వడమాలపేట పట్టణం, కాయం పేట, ఎస్ బి ఆర్ పురం, పాధిరేడు గ్రామాలలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నగిరి నియోజకవర్గం ఇంచార్జ్ గాలి భాను ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నందమూరి తారకరామారావు విగ్రహానికి గజమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ... నలభై సంవత్సరాల క్రితం 1982, మార్చి 29న అన్న ఎన్టీఆర్ చేతుల మీదుగా పురుడుపోసుకున్న తెలుగుదేశం పార్టీ 22సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగింది. కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించింది. మరో 18సంవత్సరాల పాటు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ ఏ కొందరు వ్యక్తుల కోసమో... కొందరికి పదవుల కోసమో ఏర్పడిన పార్టీ కాదు.. ప్రజల కోసం... ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం.. పేదలకు కూడు, గూడు, గుడ్డ నినాదంతో నాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం... ఈ 40 ఏళ్లలో సామాన్య ప్రజల జీవితాల్లో పెను మార్పులు తెచ్చింది. కొందరికే పరిమితం అయిన అధికారాన్ని అన్ని వర్గాలకు పంచిన పార్టీ తెలుగు దేశమని, అభివృద్ధి,సంక్షేమం, సంస్కరణల ఫలితాలను గ్రామ స్థాయికి అందించిన చరిత్ర టీడీపీదేనని అన్నారు. ప్రాంతీయ పార్టీగా ఉన్నా, జాతీయ భావాలతో సాగే పార్టీ టీడీపేనని చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథం వైపు దూసుకుపోయిందని.. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం గాడినపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల అధ్యక్షుడు జానా వెంకటయ్య, జిల్లా అధికార ప్రతినిధి ధనంజయ నాయుడు, నగరి నియోజకవర్గ యువత అధ్యక్షుడు వెంకటేష్ (చిట్టి) మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు వినోద్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.