
ప్రజాశక్తి- సరుబుజ్జిలి : మండలంలోని ఇసకలపాలెంలో మహిళా కిసాన్ దివస్ కార్యక్రమాన్ని కృషి విజ్ఞాన కేంద్రం సౌజన్యంతో గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ బి.సునీత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందుగా మహిళలకు రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయ పనుల్లో 60 శాతం వరకు మహిళలు సహాయం చేస్తున్నారని వెల్లడించారు. అయితే వారి హక్కులను పురుషులకు, స్త్రీలకు మధ్య వ్యత్యాసం వల్ల జీతం తేడా తదితర అంశాలపై ఉద్దేశించి మాట్లాడారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా మంచి పోషకాహారాన్ని తింటూ వ్యవసాయ, పశు రంగాల్లో మహిళలు సాధికరతను సాధించాలన్నారు. బిటిఎం ఆత్మ ఎం. సౌమ్య మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో స్త్రీ పాత్ర చాలా ముఖ్యమైనదని, విత్తనాలు విత్తడం మొదలుకొని కలుపు తీయడం, కోత కోయడం వరకు కీలక పాత్ర పోషిస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నిక్రా జి.శిల్ప, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ బి.రాజ్ కుమార్, మహిళా రైతులు పాల్గొన్నారు.