ఘనంగా గణనాథుని పూలంగి సేవ
ప్రజాశక్తి- ఐరాల: కాణిపాకం శ్రీస్వయంభు వరసిద్ధి వినాయకస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా సోమవారం సిద్ధిబుద్ధి సమేత వినాయకస్వామికి పూలంగి సేవను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈమేరకు ఆలయ వరస ఉభయదారులైన వేలూరుకు చెందిన రాజమాణిక్యం నాయుడు అండ్ సన్స్ కాణిపాకానికి చెందినకి రాధాకష్ణన్లు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈసందర్భంగా పగలు స్వామివారికి వివిధ రకాల సుగంధ పరిమళద్రవ్యాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. అలాగే వివిధ రకాల పరిమళపుష్పాలతో రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభయామానంగా అలంకరించిన పూలంగిసేవలో సిద్ధిబుద్ధి సమేత గణపతిని ఉంచి కాణిపాకం పురవీధుల గుండా మంగళ వాయిద్యాలు నడుమ ఘనంగా ఊరేగించారు. ఆలయ ఈఓ ఎంవి.సురేష్‌బాబు, ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మెన్ ఎ.మోహన్‌రెడ్డి, ఈఈ వెంకట నారాయణ, ఏసి కస్తూరి, ఏఈవోలు విద్యాసాగర్‌రెడ్డి, రవీంద్రబాబు, ఎస్వీకష్ణారెడ్డి, హేమమాలిని, హరిమాధవరెడ్డి, సూపరింటెండెంట్లు, కోదండపాణి, వాసు, శ్రీనివాసులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు రమేష్, బాబు, ప్రధాన ఇంచార్జ్ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.










