Jul 04,2023 23:57

అనంతగిరిలో అల్లూరికి నివాళి అర్పిస్తున్న జెడ్‌పిటిసి గంగరాజు, గిరినులు


ప్రజాశక్తి-యత్రాంగం
మన్య వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి మంగళవారం జిల్లా వ్యాప్తంగా వాడవాడలా ఘనంగా జరిపారు. ప్రజా ప్రతినిధులు అధికారులు రాజకీయ నాయకులు ప్రజా సంఘాల సంఘాల నాయకులు విద్యార్థులు పలుచోట్ల అల్లూరి విగ్రహాలకు, ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
పాడేరు: పాడేరు లోని కలెక్టరేట్‌ ఆవరణలో గల అల్లూరి సీతారామరాజు విగ్రహానికి జాయింట్‌ కలెక్టర్‌ శివ శ్రీనివాస్‌ , డిఆర్‌ఓ పి. అంబేద్కర్‌, జి మాడుగుల జడ్పీటీసీ డా. ఎం వెంకటలక్ష్మి, ఎంపీపీ ఎస్‌ రత్న కుమారి కలక్టరేట్‌ సిబ్బంది తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఐటిడిఎ ప్రాంగణంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఐటిడిఎ సహాయ ప్రాజెక్ట్‌ అధికారి ఎం. వెంకటేశ్వర రావు, పరిపాలన అధికారి హేమలత పూల మాలలు వేసి ఘనంగా నివ్నాలర్పించారు. ఐటిడిఎ కార్యాలయంలో గిరిజన సంక్షేమ శాఖ ఈ ఈ డి.వి.ఆర్‌.ఎం.రాజు, పరిశ్రమల శాఖ ఎ. డి నవీన్‌ తదితరులు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండలంలోని నక్కల పుట్టు గ్రామంలో టిడిపి నాయకులు బొర్రా నాగరాజు కొట్ట గుల్లి సుబ్బారావు ప్రసాద్‌ తదితరులు అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అల్లూరి స్ఫూర్తితో ఉద్యమించాలి: అప్పలనర్స
పాడేరు:అల్లూరి ఉద్యమస్ఫూర్తితో అడవి, ఆదివాసీల హక్కుల రక్షణకు ఉద్యమించవలసిన అవసరం ఆసన్నమైందని గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అప్పలనర్శ పిలుపునిచ్చారు. గిరిజన సంఘం సంఘం జిల్లా కార్యాలయం వద్ద అల్లూరి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,ఆదివాసీలు, అడవి బిడ్డల హక్కుల కోసం పోరాడిన వీరుడు అల్లూరి అని కొనియడారు.ఆదివాసీల అడవులూ, కొండలూ, గనులూ కార్పొరేట్లకు కట్టబెడుతున్న ప్రభుత్వాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు ఎస్‌.ధర్మాన పడల్‌, కార్యదర్శి పి.బాల్‌ దేవ్‌, జిల్లా నాయకులు ఎల్‌.సుందర్రావు, కే.సత్యనారాయణ. టి.కృష్ణారావు, పి.సూర్యనారాయణ. కే.నర్సయ్య పాల్గొన్నారు.
ఆదర్శంగా తీసుకోవాలి: జెసి
పాడేరు: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకుని అందరూ చైతన్యవంతులు కావాలని సంయుక్త కలక్టర్‌ జె.శివ శ్రీనివాసు పిలుపునిచ్చారు. కలక్టరేట్‌ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న జేసి మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత కలిగి ఉండాలని సూచించారు. స్థానిక ఎంపిపి రత్నకుమారి మాట్లాడుతూ దేశం కోసం, అడవి బిడ్డల బాగోగుల కోసం పోరాడిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అన్నారు. జి.మాడుగుల జెడ్పిటిసి ఎంవెంకటలక్ష్మి మాట్లాడుతూ, భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధుడు, మన్యం వీరుడు, అల్లూరి అని అభివర్ణించారు. డిఆర్‌ఓ పి. అంబేద్కర్‌, తహసిల్దార్‌ త్రినాధారావు నాయుడు, కలక్టరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు.
పాడేరు: గిరిజన చట్టాలు. హక్కులు పూర్తిస్థాయిలో అమలు చేసి అల్లూరి ఆశయాలను కాపాడాలని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పాంగి ధనుంజరు డిమాండ్‌ చేశారు. చింతపల్లి మండలంలోని తాజంగి పంచాయతీ పాత తాజంగిలో అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రామ యువత ఉపూర్ణ రవి శంకర్‌, చింతర్ల చినబాబు, చింతర్ల ప్రతాప్‌, మహిళలు మోహిని,చంటి పాల్గొన్నారు.
పాడేరు:జిల్లా పోలీస్‌ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఎస్‌పి తుహిన్‌ సిన్హా పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ హిమగిరి, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.
అరకులోయ రూరల్‌:మండలంలోని బస్కి గిరిజన ఆశ్రమ ఉన్నత బాలుర పాఠశాలలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అల్లూరి చిత్రపటాన్ని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అరకువేలి ఎస్‌ఎఫ్‌ఐ కన్వీనర్‌ కిల్లో ధనలక్ష్మి మాట్లాడుతూ,గిరిజన ప్రాంతంలో గిరిజన హక్కులు, చట్టాల అమలుకు గిరిజనులను ఐక్యం చేసి పోరాటం సాగించారన్నారు.ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సిరగం చరణ్‌, కుమిడి శాంతి, కాకరి కొండమ్మ, సొడపల్లి ఇసుబాబు, వంతల బలరాం, పూజారి కృష్ణ పాల్గొన్నారు.
పెదబయలు:స్థానిక రెసిడెన్సియల్‌ బాలుర పాఠశాలలో అల్లూరి వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రిన్సిపాల్‌ డి శంకర్‌రావు అల్లూరి చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ ప్రతాప్‌, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు
డుంబ్రిగుడ: అల్లూరి జయంతి వేడుకలను మండలంలోని గుమ్మాగూడ గ్రామంలో గిరి బాల నేస్తం క్లబ్‌ మండల కన్వీనర్‌ కుమారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బాల నేస్తం క్లబ్‌ లో ఉన్న చిన్నారులకు అల్లూరి జీవిత చరిత్రను మండల కన్వీనర్‌ కుమారి వివరించారు. గిరి పరి నేస్తం క్లబ్‌ మండల కమిటీ సభ్యులు ఎస్‌.గీత, శిరీష, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. మండల కేంద్రంలోని అల్లూరి విగ్రహం వద్ద అల్లూరి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. అల్లూరి విగ్రహానికి ఆ సంఘం మండల అధ్యక్షుడు కే.సూర్య ప్రకాష్‌, ఏం.నవ సూర్య, టిఎన్‌టియుసి అరకు పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి ఎం.స్వామి నివాళులర్పించారు.
జి.మాడుగుల:మండల కేంద్రంలో సిఐటియు, ఆదివాసీ గిరిజన సంఘం, జివో నెం: 3 సాధన కమిటీ ఆధ్వర్యంలో అల్లూరి చిత్రపటానికి పూల మాల వేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి జె దీనబంధు, ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి కొటారి కోటేశ్వరరావు మాట్లాడారు.నాయకులు మోధకొండమ్మ, సత్యవతి, కాంతమ్మ, జివో 3 సాధన కమిటీ నాయకులు సింహాచలం పాల్గొన్నారు.
పోరాటం చేయాలి: గంగరాజు
అనంతగిరి:అల్లూరి స్పూర్తితో గిరిజన హక్కులు, చట్టాల సాధనకై పోరుబాట సాగించాలని సీపీఎం జెడ్పీటీసీ. దీసరి. గంగరాజు పిలుపు నిచ్చారు. మండల కేంద్రంలోని బొడ్డచెట్టుకొలని వద్ద సిపిఎం, ప్రజాసంఘాల ఆధ్వర్యాన జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా గంగరాజు మాట్లాడుతూ,గిరిజన ప్రాంతంలో గిరిజనుల హక్కుల కోసం అల్లూరి ఉద్యమించారని, చిన్న వయస్సులోనే దేశం కోసం ప్రాణాన్ని త్యాగం చేశారన్నారు. నేటి పాలకులు అల్లూరి స్పూర్తికి విరుద్దంగా గిరిజనుల హక్కులు, చట్టాలను తుంగలో తొక్కుతున్నాయన్నారు. అంగన్వాడీ టీచర్‌ సరస్వతి, ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి జన్ని. సుబ్బారావు, సాగర. చినారావు, పాంగి.రవీంద్ర, కొర్ర .శివకృష్ణ, మహిళలు పాల్గొన్నారు
రాజవొమ్మంగి : ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన ప్రజలు సమస్యలు పరిష్కారానికై అల్లూరి స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలని ఎపి ఆదివాసీ గిరిజన సంఘం, ప్రజా సంఘాల నాయకులు కొండ్ల సూరిబాబు, వజ్రపు అప్పారావు, పి.రామరాజు పిలుపునిచ్చారు. రాజవొమ్మంగి, దుర్గానగర్‌, తదితర గ్రామాల్లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ మన్యంలో బ్రిటిష్‌ వారి ఆగడాలకు వ్యతిరేకంగా, గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో నాయకులు పి.సత్యనారాయణ, ఎస్‌.రాజు, జిలానీ, రాజేష్‌, శ్రీను పాల్గొన్నారు.
కొయ్యూరు : మండల కేంద్రంలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి సిపిఎం, ఎపి ఆదివాసీ గిరిజన సంఘం, సిఐటియు నాయకులు ఎస్‌.సూరిబాబు, జంపా పెంటయ్య, పాంగి గంగరాజు, వై.అప్పల నాయుడు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్లూరి నడయాడిన ప్రాంతమైన మంప, రాజేంద్రపాలెం, కృష్ణదేవి పేట ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని డిమాండ్‌ చేశారు. సిదరి మల్లేసు, సైలజ గంగరాజు, వెంకటేష్‌, కుమార్‌, రాజేష్‌, పాల్గొన్నారు.