Apr 22,2023 21:03

గ్యాస్‌ సిలిండర్‌ తీసుకెళ్తున్న వినియోగదారుడు

ప్రజాశక్తి-బొమ్మనహాల్‌       బొమ్మనహాల్‌ మండల పరిధిలోని పలు గ్రామాలకు వంట గ్యాస్‌ సిలిండర్లు సకాలంలో సరఫరా చేయడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా దాదాపు అన్ని కుటుంబాల వారూ వంట చేసేందుకు గ్యాస్‌ వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా కుటుంబాలు గ్యాస్‌ కనెక్షన్లు పొందాయి. వినియోగదారులు గ్యాస్‌ బుక్‌ చేస్తే కంపెనీ సిబ్బంది ఒక్కో సిలిండర్‌కు రూ.1,290 వసూలు చేస్తున్నారు. దీనికి తోడు ఇంటి వద్దకు వచ్చి సిలిండర్‌ ఇవ్వాలని నిబంధన ఉన్నా సరఫరా చేయడం లేదని పేర్కొంటున్నారు. బళ్లారి-కణేకల్‌ ప్రధాన రహదారి వద్దకు వచ్చి సిలిండర్‌ తీసుకెళ్లాలని కంపెనీ సిబ్బంది పేర్కొంటున్నారని, ఈ విషయమై కంపెనీ నిర్వాహకులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ప్రధాన రహదారి నుంచి గ్రామంలోకి అర కిలోమీటర్‌ దూరం ఉందని, దీంతో వికలాంగులు, వృద్ధులు సిలిండర్‌ తీసుకెళ్లడానికి కూలీలను ఆశ్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు. దీనికి తోడు సిలిండర్‌ లీకేజీ అవుతున్నా, రెగ్యులేటర్‌ పని చేయకపోయినా ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక ప్రయివేటు మెకానిక్‌లను ఆశ్రయించి అదనంగా సొమ్ము చెల్లిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి, హాస్టళ్లకు, హోటళ్లకు కూడా సిలిండర్లు సక్రమంగా సరఫరా చేయడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్యాస్‌ బుక్‌ చేసిన మూడు రోజులకే సిలిండర్‌ ఇంటి వద్దకే సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.