Mar 03,2023 18:55

ప్రజాశక్తి - ఆచంట
బిజెపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలంతా ఐక్యంగా పెద్దఎత్తున పోరాటం చేయాలని సిపిఎం మండల కమిటీ సభ్యులు సిర్రా నర్సింహమూర్తి, పి.మోహనరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన గ్యాస్‌ ధరలను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని ఆచంట, పెనుమంచిలి, వల్లూరు గ్రామాల్లో గ్యాస్‌ బండలు నెత్తిన పెట్టుకొని నిరసన తెలిపారు. సంతమార్కెట్‌ వీధి, రామేశ్వరస్వామి సత్రం మీదుగా ఆచంట కచేరీ సెంటర్‌ వరకూ గ్యాస్‌ బండలను నెత్తిన ధరించి భారీర్యాలీ నిర్వహించారు. సెంటర్‌లో జరిగిన సభకు మండల కమిటీ సభ్యులు ఎస్‌విఎన్‌ శర్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బిజెపి ప్రభుత్వం ఎల్‌పిజి గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.50, వాణిజ్య సిలిండర్‌ ధ రూ.350 పెంచడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం సబ్సిడీ జమను రెండు సంవత్సరాల నుండి నిలిపివేసిందన్నారు. ఇప్పటికే గృహ వినియోగానికి సబ్సిడీ కింద ఇచ్చే సిలిండర్ల సంఖ్యను కుదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్రంలో రాజకీయ పార్టీలతోపాటు ప్రజలంతా కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ చర్యలపై తిరగబడాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్‌ ధరలను ఉపసంహరించుకునే వరకూ ప్రజా పోరాటాలు చేస్తూనే ఉంటామన్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు వద్దిపర్తి అంజిబాబు, ఇంజేటి వీరయ్య, సీనియర్‌ నాయకులు తోటపల్లి సత్యన్నారాయణ, ఇందుకూరి సూర్యనారాయణ రాజు, బొర్రా ధర్మారావు, సిర్రా విఘ్నేశ్వరరావు, టి.దుర్గాప్రసాద్‌, కేతా భవానీశంకర్‌, మానుకొండ రాంబాబు, పిల్లి శ్రీరాములు, తాళం సుబ్బారావు, దాసరి తిరుపతిరావు, దాసరి కీర్తిశ్రీ, పార్శి సత్యవతి, మానుకొండ నర్సింహమూర్తి, పైడి సత్యన్నారాయణ, నిమ్మకాయల చందర్రావు, బొర్రా నాగేశ్వరరావు పాల్గొన్నారు.