Mar 08,2022 22:50

విలేకరులతో మాట్లాడుతున్న ఎంపి మిధున్‌ రెడ్డి

ప్రజాశక్తి- పుంగనూరు : శాసనసభ ప్రారంభోత్సవంలో గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకోవడం ప్రతులను చింపడం సరైన పద్ధతి కాదని లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌, రాజంపేట పార్లమెంట్‌ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. పుంగనూరు మున్సిపాలిటీలో రెండవ రోజు 9,10,11,12,13వార్డులలో వార్డుబాట కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రానికి గవర్నర్‌ ఉన్నతమైన హోదా కలిగిన వారిని వయసులోనూ పెద్దవారిని అలాంటి వారిపై తెలుగుదేశం పార్టీ నాయకులు రాద్ధాంతం చేయడం సరైన పద్ధతి కాదన్నారు. అడుగడుగున గవర్నర్‌ను అవమానపరిచే లాగా తెలుగుదేశం నాయకులు ప్రవర్తించారని ఇది చాలా హేయమైన చర్య అన్నారు. గతంలో పలుమార్లు టిడిపి నాయకులు గవర్నర్‌కు వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. శాసన సభలో గవర్నర్‌పై జరిగిన తీరు బ్లాక్‌డే అని అన్నారు. వార్డు బాటలో ప్రజల్లో సమస్యలున్నా ఇతర సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కోసమే వ్యక్తిగతంగా కూడా కలవడం జరుగుతుందన్నారు. ఎంకేబి కోల్డ్‌ స్టోరేజ్‌లో పనిచేస్తున్న హమాలీలు యూనియన్‌ నాయకుడు ఎల్లప్ప ఆధ్వర్యంలో ఎంపీని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హమాలీలు ఇళ్ల పట్టాలు కావాలని ఎంపీని కోరాగా వెంటనే వారి వివరాలు తెలుసుకొని అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్‌ చైర్మన్‌ అలీబాష ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, ముడా చైర్మన్‌ వెంకట్‌రెడ్డి యాదవ్‌, రాష్ట్ర సాంస్కతిక విభాగం ఛైర్మన్‌ కొండవీటి నాగభూషణం, ఎంపీపీ భాస్కర్‌రెడ్డి, జెడ్‌పిటిసి జ్ఞానప్రసన్న చంద్ర యాదవ్‌, వైస్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు, మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహ ప్రసాద్‌ తహశీల్దార్‌ పాల్గొన్నారు.