Jul 20,2023 22:34

ధర్నా చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు

               ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌   జిల్లాలోని గురుకుల పాఠశాలలో సీట్ల సంఖ్య పెంచాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతురు పరమేష్‌ డిమాండ్‌ చేశారు. గురువారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో డిసిఒ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరువు జిల్లాలో వందలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలు నివసిస్తున్నారని తెలిపారు. వర్షాభావ పరిస్థితుల్లో పంటలు పండక కరువు ఏర్పడుతోందన్నారు. ఈ క్రమంలో జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు బెంగళూరు, కేరళ, మహారాష్ట్ర్ర, తమిళనాడు తదితర రాష్ట్రాలకు ప్రజలు వలస వెళ్తుంటారని తెలిపారు. అదే సందర్భంలోనే తమ పిల్లలను చదివించుకోవాలని కోటి ఆశలతో గురుకుల పాఠశాల సీట్లు కోసం తల్లిదండ్రులు దరఖాస్తు చేశారని తెలిపారు. పాఠశాల ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో అర్హత కలిగిన విద్యార్థులకు, ఆర్థికంగా వెనకబడిన, సామాజికంగా వెనకబడిన విద్యార్థులకు గురుకుల పాఠశాలలో సీట్లు రాకపోవడం బాధాకరమ న్నారు. తమ పిల్లల్ని గురుకుల పాఠశాలలో ప్రవేశం కల్పించాలని మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి డిసిఓ కార్యాలయం చుట్టూ ప్రతి రోజు విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రదర్శనలు చేస్తున్నారని తెలిపారు. అధికారులు మాకు ప్రభుత్వం కేటాయించిన సీట్లు పక్కాగా భర్తీ చేస్తున్నామని చెప్పడం పరిపాటిగా మారిందన్నారు. దీంతో కొంతమంది తల్లిదండ్రులు డిసిఒ కార్యాలయం చుట్టూ ప్రదర్శనలు చేయలేక తమ పిల్లల్ని ఇంటి దగ్గరే ఉంచుకునే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. మరి కొంతమంది తమతో పాటు పిల్లల్ని వలస తీసుకెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలన్నారు. విద్యార్థినులకు గురుకుల పాఠశాలలో రక్షణ కల్పించాలని, అత్యాచారాలను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. అలాగే గురుకుల పాఠశాలలో సీట్ల సంఖ్య పెంచాలన్నారు. అనంతరం డిసిఓ మురళీకృష్ణను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు రజిత, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి సూర్యప్రకాష్‌, జిల్లా నాయకులు శివ, వర్ధన్‌ చంద్ర, రాజేష్‌, వినోద్‌, శివమ్మ, ఓంకార్‌, తదితర విద్యార్థి నాయకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.