నార్పల : జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించే గూగూడు కుళ్లాయిస్వామి ఉత్సవాలకు ఈ సారి జడివాన అడ్డంకిగా మారింది. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న జడివానతో బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా దాదాపు 10 రోజుల పాటు ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేస్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు ఇక్కడ దుకాణాలు నిర్వహిస్తారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గూగూడుకు వచ్చే భక్తుల సంఖ్య నామమాత్రంగానే ఉంది. దీంతో వ్యాపారాలు సన్నగిల్లాయి. కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన చిన్నసరిగెత్తు భక్తులు లేక వెలవెల బోయింది. ప్రతి ఏడాదీ చిన్నసరిగెత్తు ఉత్సవానికి ఉదయం నుంచే భక్తులు పోటెత్తేవారు. ఈ ఏడాది జడివానకు ఆస్థాయిలో భక్తులు ఎవరూ రాలేదు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వివిధ దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వ్యాపారులకు వ్యాపారాలు లేక ఇబ్బంది పడ్డారు. తాము తీసుకున్న స్థలాలకు బాడుగలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందంటూ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏర్పాట్లపైనా వర్షం దెబ్బ
రెండు రోజులుగా కురుస్తున్న జడివానకు అటు బ్రహ్మోత్సవాల నిర్వహణకూ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలూ కలగకుండా వివిధ పంచాయతీల నుంచి పంచాయతీ కార్మికులను పిలిపించి గూగుడు గ్రామం మొత్తం పారిశుధ్య పనులు చేయించారు. రోడ్డుపై మొత్తం మట్టి గ్రావెల్‌ను తోలించి అన్ని ఏర్పాట్లు చేశారు. గ్రామ సర్పంచ్ రమణకుమారి శివయ్య, ఎంపీడీవో దివాకర్, ఈవోఆర్డీ లక్ష్మీనరసింహ, పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాసులు, వెంకటరెడ్డిల ఆధ్వర్యంలో గత పది రోజుల నుంచి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఈ ఏర్పాట్లు అన్నీ కూడా వృథా అయినట్లు కన్పిస్తోంది. వర్షాల దెబ్బకు గుగూడులోని డ్రెయినేజీ నీరు మొత్తం రోడ్లపై పారుతోంది. ఆలయానికి వచ్చే రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. వీటిపై భక్తులు నడిచేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ వర్షాలు ఇలాగే కొనసాగితే కుళ్లాయి స్వామి పెద్ద సరిగెత్తు, అగ్నిగుండ ప్రవేశం, జలధి కార్యక్రమాల్లో భక్తులకు ఇబ్బందులు తప్పేలా లేవు.
భక్తులపై టోల్‌బాదుడు..
కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి గూగూడుకు వచ్చే భక్తులపై టోల్‌బాదుడు పడుతోంది. గూగూడు గ్రామ సరిహద్దులోనే పంచాయతీ గేటును ఏర్పాటు చేసి ఇష్టానుసారంగా టోల్‌ను వసూలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనానికి సైతం రూ.20 వసూలు చేస్తున్నారు. కార్లు, ఇతర వాహనాలకు వంద రూపాయల టోకెన్లు ఏర్పాటు చేసి వసూలు చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే తాము పంచాయతీలో వేలాలు పాడామని, అందుకే టోల్ వసూలు చేస్తామని చెబుతున్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులును ప్రజాశక్తి వివరణ కోరగా టోల్‌గేటు వసూలుకు పంచాయతీ వేలాలు వేసిన మాట వాస్తవమే అన్నారు. ఇందులో ద్విచక్ర వాహనాలకు ఎటువంటి రుసుం లేదన్నారు. ఆటోకు రూ.30, కారుకు రూ.50, ఇతర భారీ వాహనాలకు రూ.70 వసూలు చేయాలని పంచాయతీ తీర్మానం చేసిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా టోల్ వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
బాడుగ కూడా వచ్చే పరిస్థితి లేదు
చిన్నా, బొమ్మల దుకాణం నిర్వాహకుడు
మదనపల్లి నుంచి వ్యాపారం నిమిత్తం గూగూడుకు వచ్చాను. కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాల్లో బొమ్మల దుకాణం ఏర్పాటు చేయడానికి రూ.20 వేలకు స్థలాన్ని బాడుగకు తీసుకున్నాను. ఈ ఏడాది వర్షాల వల్ల వ్యాపారాలు జరగడం లేదు. కనీసం స్థలం బాడుగ కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది.
కొనేవారే కరువయ్యారు
ప్రసాద్, మిఠాయి వ్యాపారి.
గూగూడు కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తాను ప్రతి ఏడాదీ గుంతకల్లు నుంచి గూగూడుకు వచ్చి కాజా, మిఠాయి అమ్మకాలు చేస్తున్నాను. ప్రతి ఏడాదీ అమ్మకాలు ఆశాజనకంగా ఉండేవి. ఈ ఏడాది వర్షాల వల్ల మిఠాయిలు కొనేవారే కరువయ్యారు.
సరుకులో 10 శాతం కూడా అమ్ముడుపోలేదు.
హనుమంతప్ప, గాజుల వ్యాపారి.
గాజుల వ్యాపారం నిమిత్తం రాప్తాడు నుంచి ప్రతి ఏడాది గూగూడుకు వస్తాను. చిన్న సరిగెత్తు సమయానికి సుమారు తాను తెచ్చిన సరుకులో సగభాగం అమ్ముడుపోయేవి. ప్రస్తుతం వర్షం కారణంగా గూగూడుకు వచ్చే మహిళల సంఖ్య తగ్గింది. ఇప్పటి వరకు తెచ్చిన సరుకులో 10 శాతం కూడా అమ్ముడుపోలేదు.










