ప్రజాశక్తి-రాయదుర్గం రాయదుర్గం ప్రసన్న వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలను మే నెలలో గతంలో కంటే ఘనంగా జరుపుదామని ఎమ్మెల్యే, విప్ విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. బ్రహ్మోత్సవాల నిర్వహణపై దేవాదాయ శాఖ సమూహ దేవాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణ అధికారి నరసింహారెడ్డి మాట్లాడుతూ మే నెల 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు 11 రోజుల పాటు ప్రసన్న వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా 8వ తేదీ కళ్యాణోత్సవం, 10వ తేదీ బ్రహ్మ రథోత్సవం జరుగుతుందన్నారు. విప్ కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఈసారి బ్రహ్మోత్సవాలను గతంలో కంటే ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఆలయం చుట్టూ నాలుగు వైపులా మాడా వీధుల నిర్మాణాన్ని పూర్తి చేయించాలని ఆలయ కమిటీ అధ్యక్షులు గౌని పాలాక్షిరెడ్డి, కార్యనిర్వహణాధికారి నరసింహారెడ్డిని కోరారు. స్వామివారి రథాన్ని నిలిపే షెడ్డు ముందుభాగాన పెయింటింగ్ వేయించాలని సూచించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో అన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రజలూ పాల్గొనేలా చూడాలన్నారు. 15వ తేదీన మరోసారి సమావేశం జరిపి ఉత్సవాల నిర్వహణ బాధ్యతల పంపిణీ చేపట్టాలని కోరారు. కల్యాణోత్సవాన్ని ప్రజలందరూ తిలకించేలా పట్టణ ప్రధాన వీధుల్లో టీవీ స్క్రీన్‌లు, లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేయాలన్నారు. గత ఏడాది జరిగిన రథోత్సవం సందర్భంగా ఆకతాయిలు విసిరిన రాళ్లు తమకు తగిలాయని మున్సిపల్ ఛైర్మన్ పొరాలు శిల్ప, విప్ కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. ఈసారి అలా జరగకుండా తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని రూరల్ సిఐ యుగంధర్‌ను కోరారు. ఉత్సవాల సందర్భంగా పిక్ పాకెటింగ్ చోరీలు, జరగకుండా చూడాలన్నారు. బ్రహ్మోత్సవాలకు ఆధ్యాత్మికవేత్త గరికపాటి వారిని పిలవాలని మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఉపేంద్రరెడ్డి సూచించారు. ఈ సమావేశంలో ఆలయ పాలకమండలి సభ్యులు సత్యనారాయణ, పద్మశాలి సామాజిక వర్గం అధ్యక్షులు శివప్ప, వార్డు సభ్యులు లావణ్య, శ్రీలక్ష్మి, శ్రీనివాసరెడ్డి, డిష్ గోవింవ, గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసులు, జయంతి రామగోపాలకష్ణయ్య శెట్టి, పొరాల శివ కుమార్, బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కోడూరు రవికుమార్, విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు దేవిరెడ్డిపల్లి రాజేష్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.










