Nov 17,2022 21:58

గృహనిర్మాణాలను వెంటనే చేపట్టాలి : జెసి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
జిల్లాలో గృహనిర్మాణాలను మరిన్ని కావాలని కోరిన ప్రదేశాలలో మంజూరు చేయడం జరిగిందని, 31 కాలనీలకు సంబంధించి ఇళ్ల నిర్మాణాలను మంజూరు చేయడం జరిగిందని ఆయా ప్రాంతాలలో వెంటనే గృహ నిర్మాణాలు చేపట్టే విధంగా తగు చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ అన్నారు. గురువారం జెసి జిల్లాలోని హౌసింగ్‌ డీఈలతో మాట్లాడుతూ జిల్లాకు తిరిగి ఇళ్లు మంజూరు అయ్యాయని, మంజూరు అయిన ఇళ్లనిర్మాణాలు వెంటనే ప్రారంభించాలన్నారు. ఈ నిర్మాణాలకు కావాల్సిన స్థలంకోసం భూసేకరణ వెంటనే చేయడం జరుగుతుందని దానిని గుర్తించాలని అన్నారు. ఇప్పటివరకు ఎవరైనా ఇంకా తమకు ఇళ్ల నిర్మాణాలు వద్దని భావిస్తూ ఉంటే వారికి సంబంధించిన వివరాలను వెంటనే పంపి జాబితా నుంచి తొలిగేటట్లు చూసుకోవాలన్నారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన పనులను ప్రారంభించి వెంటనే వేగవంతంగా పూర్తిచేసుకునే విధంగా తగుచర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా అడిగిన వారికి ఇళ్లనిర్మాణాలకు మంజూరు ఇవ్వడం జరిగిందని అందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ లక్ష్యం మేరకు సొంత ఇల్లు యజమానులు కావాలనుకునేవారు నిర్మాణాలను వెంటనే ప్రారంభించి ముగించేలా చర్యలు తీసుకోవాలని జెసి జిల్లాలోని హౌసింగ్‌ ఇంజనీరింగ్‌ అధికారులతో అన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ పద్మనాభం పాల్గొన్నారు.