నివాసం ఉండలేక వెనుదిరుగుతున్న లబ్ధిదారులు
ఊసేలేని పాఠశాల, వాటర్ ప్లాంట్, శ్మశానం
సిపిఎం బృందం పరిశీలనలో వాపోయిన లబ్ధిదారులు
మౌలిక వసతులు కల్పించాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం
ప్రజాశక్తి - భీమవరం
పట్టణ పరిధిలో 82 ఎకరాల్లో నిర్మించిన టిడ్కో ఇళ్లు పేదలు గృహప్రవేశం చేయకుండానే శ్లాబ్‌లు లీక్ అవుతూ, పెచ్చులూడిపోతున్నాయని, వాటికి వెంటనే మరమ్మతులు చేపట్టి పేదలకు అప్పగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం బృంందం మంగళవారం టిడ్కో ఇళ్లను పరిశీలించింది. ఈ సందర్భంగా బలరాం మాట్లాడారు టిడ్కో ఇళ్లలో మౌలిక వసతులు లేవని, రెండుపూటలా తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. వర్షానికి శ్లాబులు లీకై కారిపోతూ పెచ్చులూడుతున్నాయని, దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని చెప్పారు. సుమారు వెయ్యి కుటుంబాలు ప్రస్తుతం ఈ ఇళ్లలోకి వెళ్లారని, మౌలిక వసతులు లేకపోవడం వల్ల ఆర్థికంగా భారమైనా తిరిగి అద్దె ఇళ్లకు వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు స్కూల్ లేదని, వాటర్‌ప్లాంట్, శ్మశానం వంటి కనీస సౌకర్యాలు కల్పించకపోవడం దారుణమన్నారు. అనేక సంవత్సరాలుగా పేదలు పోరాడుతున్నా పేదలకు ఇళ్లు అందించకపోవడం దారుణమన్నారు. ఒకపక్క పెరుగుతున్న ధరలు, మరోపక్క ఇంటి అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిచ్చిమొక్కలు పెరిగి పాములు వస్తున్నాయని లబ్ధిదారులు భయపడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి లబ్ధిదారులందరికీ టిడ్కో ఇళ్లు అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ బృందంలో సిపిఎం పట్టణ కార్యదర్శి బి.వాసుదేవరావు, నాయకులు ఎం.వైకుంఠరావు, కె.కృష్ణ, డి.నాగు, డి.త్రిమూర్తులు, చెల్లబోయిన వెంకటేశ్వరరావు, లబ్ధిదారులు శ్రీను, కృష్ణ, మావుళ్లు, మద్దాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.










