Jul 15,2023 08:56

వీడియో కాన్ఫిరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ గౌతమి

         అనంతపురం కలెక్టరేట్‌ : ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల స్థలాల్లో గృహ నిర్మాణాలు చేపట్టేలా లబ్ధిదారుల్లో అవగాహన పెంచి పనుల్లో పురోగతి చూపాలని కలెక్టర్‌ ఎం.గౌతమి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో హౌసింగ్‌ లేఅవుట్‌లలో జరుగుతున్న గహ నిర్మాణ పురోగతిపై సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెలాఖరు వరకు మొత్తం ఇళ్లు 19,193 పూర్తి కావాలని లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటివరకు 15,976 ఇళ్లు పూర్తి అయ్యాయని తెలిపారు. మిగిలిన 3,222 ఇళ్లు రెండు వారాల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వివిధ దశల్లో ఉన్న గహ నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలన్నాని సూచించారు. లేఅవుట్‌లలో విద్యుత్‌, వీధిలైట్లు ఏర్పాట్లు, తాగునీటి వంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ఆగస్టు మాసంలో సామూహిక గహప్రవేశాలు జరగనున్నందున హౌసింగ్‌ అధికారులు పెండింగ్‌ పనులను పూర్తి చేయాలని తెలిపారు. 65 సిఎస్‌ఎంసి ద్వారా మంజూరైన 8,223 ఇళ్లకు సంబంధించి లేఅవుట్లకు మ్యాపింగ్‌, జియో టాకింగ్‌, మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్‌ పీడీ కేశవ నాయుడు, హౌసింగ్‌ డీఈ లక్ష్మీ నారాయణమ్మ, జడ్పీ సీఈవో భాస్కర్‌ రెడ్డి, మెప్మా పీడీ విజయలక్ష్మి, ఆర్‌డబ్ల్యూ ఎస్‌ఈ ఎహ్సాన్‌ బాషా, ఐసిడిఎస్‌ పీడీ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.