
ప్రజాశక్తి- పోలాకి: ప్రజా కవి, స్వతంత్ర సమరయోధులు గరిమెళ్ల సత్యనారాయణ జన్మించిన ప్రియాగ్రహారాన్ని మేనల్లుడు డాక్టర్ ఇ.వి.అర్.రావు, మనవడు వై.లక్ష్మణరావు గురువారం సందర్శించారు. ప్రియాగ్రహారంలోని గరిమెళ్ల విహార్, గరిమెళ్ల పేరున ఉన్న కళాశాల, పాఠశాలను పరిశీలించారు. ముందుగా సత్యనారాయణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. గరిమెళ్ల ట్రస్టు ప్రధాన కార్యదర్శి బాడాన రాజు అధ్యక్షతన వారు మాట్లాడారు. గరిమెళ్ల వారసులుగా గర్వపడుతున్నామని అన్నారు. గరిమెళ్ల స్వగృహాన్ని ఒక స్మారక స్మృతి చిహ్నంగా ప్రభుత్వమే తీర్చిదిద్దాలని కోరారు. గరిమెళ్ల విజ్ఞాన కేంద్ర అధ్యక్షులు వి.జి.కె.మూర్తి మాట్లాడుతూ జాతి మరచిన జాతి రత్నం గరిమెళ్ల అని అన్నారు. రాజు మాట్లాడుతూ తపాలా శాఖ సౌజన్యంతో గరిమెళ్ల సత్యనారాయణ పేరిట త్వరలో ప్రత్యేక తపాలా ముద్రికను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నాగేంద్ర, పాఠశాల ప్రధానోపాధ్యాయులు విశ్వేశ్వరరావు, గౌరవ సభ్యులు గణపతిరావు, భాను, గౌరవ సభ్యులు ఐ.గణపతిరావు, దుబ్బ కోటేశ్వరరావు, రగుతు మోహన్‌కుమార్ పాల్గొన్నారు.