Mar 18,2023 21:52

వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి విగ్రహ ఏర్పాటుతో గ్రామంలో అలజడి
శాసనమండలి ఛైర్మన్‌ హెచ్చరించినా పట్టించుకోని వార్డ్‌ సభ్యుడు
నిర్మాణాన్ని అడ్డుకున్న దళితులు
అధికారుల ఆదేశాలతో పనులు నిలిపివేత
ప్రజాశక్తి - పాలకోడేరు

            ఒకరు రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌... మరొకరు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కీర్తిశేషులు వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి.. వీరిద్దరి ప్రతిష్టను అపహస్యం చేసేందుకు ఒడికట్టాడు అధికార పార్టీకి చెందిన వార్డు సభ్యుడు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సాంఘిక బహిష్కరణకు గురైన గరగపర్రు అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటు ప్రాంతంలో రాజశేఖర్‌ రెడ్డి విగ్రహం ఏర్పాటుకు ఆ వార్డు సభ్యులు చర్యలు తీసుకోవడంతో గ్రామంలో మళ్లీ అలజడి మొదలైంది. గతంలో రాజశేఖర్‌రెడ్డి విగ్రహ నిర్మాణ పనులు దళితులు అడ్డుకుని శాసనమండలి ఛైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లడంతో అది సరైన పద్ధతి కాదని సంబంధిత వ్యక్తిని హెచ్చరించినప్పటికీ పట్టించుకోకుండా శనివారం నిర్మాణ పనులు మళ్లీ చేపట్టారు. ఈ నేపథ్యంలో దళిత ప్రాంతానికి చెందిన కొంతమంది ఈ పనులు అడ్డుకున్నారు. గరగపర్రులో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారంటూ దళితులను సాంఘిక బహిష్కరణ చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో దళితులకు పరిహారం అందడంతో పాటు బిఆర్‌.అంబేద్కర్‌ విగ్రహాన్ని ప్రభుత్వ లాంఛనాలతో గరగపర్రు పాత పంచాయతీ భవనం ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐదేళ్ల అనంతరం గ్రామంలో ఏర్పడిన అలజడిని మర్చిపోయి అందరూ ఐక్యంగా ముందుకు సాగుతున్న తరుణంలో అధికార పార్టీకి చెందిన వార్డు సభ్యుడు అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణ ప్రాంతంలోనే సమాంతరంగా రాజశేఖర్‌రెడ్డి విగ్రహ నిర్మాణాన్ని చేపట్టారు. రాజశేఖర్‌రెడ్డి మరణించి సుమారు 12 ఏళ్ల తర్వాత వివాదాల కేంద్ర బిందువుగా ఎటువంటి అనుమతి లేకుండా ఏర్పాటు చేస్తున్న ఈ నిర్మాణాన్ని అంబేద్కర్‌ వాదులు, స్థానిక దళితులు గతంలో అడ్డుకున్నారు. అయినా తీరు మారకుండా తిరిగి మళ్లీ నిర్మాణ పనులను వార్డు సభ్యుడు ప్రారంభించాడు. దీంతో ఆగ్రహించిన స్థానికులు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ అందరికీ కనిపించకుండా ఉండాలని దుర్బుద్ధితో ఈ విధంగా రాజశేఖర్‌రెడ్డిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం తగదని నిర్మాణ పనులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని పంచాయతీ రెవెన్యూ అధికారుల దృష్టికి స్థానిక దళితులు తీసుకెళ్లడంతో వారు అక్కడకు చేరుకుని నిర్మాణ పనులను మరో మారు నిలుపుదల చేశారు.
తీరు మార్చుకొని వార్డు సభ్యుడు
అంబేద్కర్‌ విగ్రహ సమీపంలో డ్రెయినేజీ ప్రాంతంలో రాజశేఖర్‌రెడ్డి విగ్రహ ఏర్పాటుపై గతంలో స్థానికులు అభ్యంతరం చెప్పారు. రాజశేఖర్‌ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేస్తున్న వార్డు సభ్యుడు విగ్రహం ముసుగులో రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతో, సానుభూతిని పొందాలనే ఆకాంక్షతో ఈ విషయాన్ని శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ఆయన హెచ్చరించినట్లు తెలిసింది. రాజశేఖర్‌ రెడ్డి అంటే అందరికీ గౌరవమని, ఆయన విగ్రహం ఏర్పాటుకు ఎవరికి అభ్యంతరం ఉండదని, అయితే కావాలని గ్రామంలో అశాంతిని రగిలించే విధంగా విగ్రహం ఏర్పాటు చేయాలనుకోవడం సరికాదని చెప్పినట్టు సమాచారం.
వివక్ష కొనసాగుతుందనడానికి ఇదే నిదర్శనం
అంబేద్కర్‌ విగ్రహం ప్రాంతంలో కావాలని రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని దళితులు, దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. గ్రామంలో విశాలమైన ప్రాంతాలు అనేకం ఉన్నాయని, అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు పక్కనే నాలుగు అడుగుల స్థలంలోనే ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో వివక్ష కొనసాగుతుందనడానికి ఈ ఘటన నిదర్శనమని దళిత సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
పార్టీకి తీవ్ర నష్టం
రాజశేఖర్‌రెడ్డి విగ్రహం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్న అటువైపు వెళ్లకుండా కేవలం తన స్వార్థం, రాజకీయ లబ్ధి కోసం పాటుపడుతున్న వార్డు సభ్యుడిపై గ్రామంలోని అధికార పార్టీకి చెందిన నాయకులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వార్డు సభ్యుడి వ్యవహార శైలితో పార్టీకి తీవ్ర నష్టం ఏర్పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని వైసిపి నియోజకవర్గ అధినాయకుడు దృష్టికి తీసుకువెళ్లాలనే ఆలోచనతో గ్రామ నాయకులు ఉన్నారని తెలిసింది.