గర్భిణులకు మరింత నాణ్యమైన ఆహారం ఇవ్వాలి : కలెక్టర్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: సమాజంలో ప్రతిఒక్కరూ బాగా ఉండాలంటే పిల్లల ఎదుగుదల ముఖ్యమని ఆ పిల్లల ఎదుగుదల బాగా రావాలంటే వారి తల్లులు తీసుకునే హారం పట్ల జాగ్రత్త వహించాలని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ సిడిఎస్‌లోని సిడిపిఓలతో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానంగా అంగన్వాడీ కేంద్రాలకు రాకుండా చాలామంది పిల్లలు బయట ఉన్నారని వారి ఆరోగ్యపరిస్థితి ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారనే విషయంపై సమగ్ర విచారణ చేయాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువమంది రిజిస్ట్రేషన్ అవుతున్నారని, పట్టణ ప్రాంతాలలో చాలా తక్కువ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని వారు సరైన ఆహారం తీసుకుంటున్నారా లేదా అని విషయం పైన సమగ్రంగా నివేదిక సమర్పించాలన్నారు. మహిళలలో జిల్లా వ్యాప్తంగా 942 మంది అనీమియా వ్యాధి గర్భిణీ స్త్రీలలో ఉందని వారికి సరైన ఆహారం ఇచ్చే విధంగా వారి ఇంటి వద్ద అంగన్వాడీ కార్యకర్త ఆశ, ఆప్రాంతం వైపు వెళ్ళినప్పుడు సిడిపిఓలు పరిశీలించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ప్రతి నెలా వైయస్‌ఆర్ కిట్ ద్వారా ఇచ్చే ఆహారంలో అవసరమైతే మరింత పోషక విలువలు ఉన్న ఆహారం లభించేటట్లు ఉంటే ఆ ఆహారాన్ని కలిపి ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ పీడీ నాగశైలజాతో పాటు సిడిపిఓలు పాల్గొన్నారు.










