అనంతపురం ప్రతినిధి : కాయగూరలకు గ్రాప్టుటెడ్(అంటుగట్టం) పద్ధతి ఏమిటా అనుకుంటున్నారా... అవును మీరు విన్నది నిజమే... అనంతపురం రూరల్ పరిధిలోని ఆలమూరు వద్దనున్న శ్రీ కృష్ణదేవరాయ ఉద్యానవన కళాశాల అధ్యాపకులు కాయగూరల్లో టమోటాకు గ్రాప్టుటెడ్ పద్ధతిలో సాగు చేస్తే ఎలాగుంటుందన్న ఆలోచన కలిగింది. తట్టిన ఆ ఆలోచనను ఆచరణలో పెట్టారు. ఇది ఒకింత సత్ఫలితాలను ఇచ్చే దిశగా ఉన్నట్టు అధ్యాపకులు చెబుతున్నారు.
అనంతపురం జిల్లాలో ఉద్యానవన పంటల్లో టమోటసాగు విపరీతంగా పెరిగింది. అయితే ఇది ఒక సీజన్‌లోనే దిగుబడి వస్తోంది. వేసవి వచ్చే సమయానికి పంట రావడం లేదు. ఎండలకు తట్టుకునే రాల్లేకపోవడంతో ఈ సమయంలో పంట దిగుబడి కూడా లేక టమోట ధరలు సైతం వేసవిలో మండుతూ ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీ కృష్ణదేవరాయ ఉద్యానవన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ జీవన్ బెట్టను తట్టుకునే రకాలైన సొలోనమ్ టోరమ్ రకం మొక్కకు సంబంధించిన వేరును, స్థానికంగా ఎక్కువగా పండించే టమోటా రకాన్ని ఒకదాన్ని ఎంచుకుని అంటుకట్టారు. దీన్ని గ్రీన్ హౌస్‌లో సాగు చేయడం ప్రారంభించారు. ఈ కలయికతో వచ్చిన మొక్క చాలా వరకు బెట్టను తట్టుకోవడమే కాకుండా, పంట దిగుబడి సాధారణంగా మూడు నుంచి నాలుగు మాసాల్లోపు పూర్తయ్యేది. పది మాసాల వరకు వస్తోందని జీవన్ తెలిపారు. అయితే ఇది ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, మరింత విస్తృత పరచి రైతుల వరకు చేర్చి చూడటం ద్వారా పూర్తి స్థాయి సామర్థ్యం తెలుస్తుందని వివరించారు. ఇది పూర్తి స్థాయి విజయవంతం అయితే అనంతపురం జిల్లాలో రైతాంగానికి ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నామన్నారు. ఎందుకంటే పంట కాలం పెరగడంతోపాటు దిగుబడి కూడా సాధారణ మొక్కకు ఐదు నుంచి ఆరు కిలోలు వస్తే దీనికి తొమ్మిది కిలోల వరకు కూడా దిగుబడి వచ్చే అవకాశముంది.
ఈ ప్రాంతావసరాలకు అనుగుణమైన రకాల కోసం ప్రయత్నిస్తున్నాం
నారాయణరెడ్డి, కళాశాల అసిస్టెంట్ డీన్
అనంతపురం జిల్లా ఉద్యానవన పంటలకు పెట్టింది. పేరు అయితే ప్రకృతి కొంత, మరికొన్ని చోట్ల నేల స్వభావం కొంత ఆటంకాలుగా ఉంటున్నాయి. ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లోనూ దిగుబడులు బాగా వచ్చి రైతులకు ప్రయోజనం చేకూరాలన్నది తమ అభిమతం. కళాశాల కేవలం విద్యను భోదించేందుకే కాకుండా ఈ ప్రాంత రైతాంగానికి మేలు చేసే విధంగా కొత్త ఆలోచనలు, ప్రయోగాలు తమ కళాశాల పరిధిలో చేస్తున్నాం. అందుకే కళాశాల సువిశాల వాతావరణంలోని దేశంలోని అన్ని రకాల మొక్కలను తీసుకొచ్చి పెంచడం జరుగుతోంది. కొత్తకొత్త రాకలుగా కూడా పెట్టియున్నాం. ఇందులో ఏ కొన్ని విజయవంతమైనా జిల్లా రైతాంగానికి ప్రయోజనం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఆ దిశగా తమ సిబ్బంది, తాము పనిచేస్తున్నాం. ఇందులో భాగంగానే టమోటా గ్రాప్టింగ్ ప్రయోగం కూడా అని వివరించారు.










